ఇలా అయితే ఎలా?

దిశ దశ, హుజురాబాద్:

ఓ వైపున రహదారి నిర్మాణం పనులు… మరో వైపున ఇష్టారీతిన వాహనాల రాకపోలు… కరీంనగర్-వరంగల్ రోడ్డుమీదుగా రాకపోకలు సాగించడం గగనంగా మారింది. ఎక్కడ రూట్ డైవర్షన్ ఉంటుదో తెలియక తికమకపడాల్సి వస్తుంటే… రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న భారీ వాహనాలను తప్పించుకుంటూ వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

బండల రవాణా…

వరంగల్, జగిత్యాల హైవే రోడ్డు పనులు సాగుతున్న సంగతి తెలిసిందే. కరీంనగర్, వరంగల్ మార్గ మధ్యలో జరుగుతున్న నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న వాహనాల వల్ల ఇక్కట్లు తప్పడం లేదు ఇతర వాహనదారులకు. బండ రాళ్లను తరలించే లారీల విషయంలో ఏ మాత్రం జాగ్రత్తలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. లోడింగ్ చేసిన లారీల బ్యాక్ సైడ్ నుంచి జారి పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లారీల బాడీ బ్యాక్ డోర్లు కూడా లేకపోవడంతో వాటిలో తరలిస్తున్న బండలు జారి పడతాయేమోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రోడ్డు నిర్మాణం కోసం తిరుగుతున్న ఈ లారీల నుండి బండ రాళ్ళు జారి పడితే తమ వాహనాలు దెబ్బతింటాయని భయ పడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా ఇలాగే బండలను తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అసలే రోడ్డు పనులు జరుగుతున్నందున రోడ్డు డైవర్షన్ వచ్చినప్పుడు కానీ, గుంతలు వచ్చినప్పుడు కానీ లారీల్లో తరలిస్తున్న బండలు జారి పడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలో ఆ లారీ వెనక ఉన్న ఇతర వెహికిల్స్ పై బండలు పడితే తీవ్రంగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.

ఓవర్ టేక్…

ఇకపోతే వాహనాల రాకపోకలు, రోడ్డు నిర్మాణ పనులతో బిజీబిజీగా ఉంటున్న ఈ రహదారిలో మరో సమస్య కూడా ఎదురవుతోంది. భారీ వాహనాలు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనుల కోసం ఉపయోగిస్తున్న భారీ వాహనాల డ్రైవర్లు కొందరు ఓవర్ టేక్ చేస్తున్నారు. దీనివల్ల ఎదురుగా వెల్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఎక్కడ బావుందో ఎక్కడ డైవర్షన్ ఉందో తెలియని పరిస్థితి ఉందని… ఈ రోడ్డుపై భారీ వాహనాలు ఓవర్ టేక్ చేస్తుండడం వల్ల తమ పరిస్థితి అయోమయంగా మారుతోందని వాహనదారులు అంటున్నారు.

You cannot copy content of this page