భూపాలపల్లి అధికార పార్టీలో ముసలం

పోటీ చేసి తీరుతానంటున్న ప్రశాంత్

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

దిశ దశ, భూపాలపల్లి:

అభ్యర్థుల ఎంపిక తరువాత అంతా సర్దుకుందనుకున్న తరుణంలో అక్కడ మళ్లీ అసమ్మతి వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకపోతున్న క్రమంలో మాజీ స్పీకర్ తనయుడు ఇచ్చిన ఝలక్ చర్చనీయాంశంగా మారింది. ఈ సారి తాను పోటీలో ఉంటానని తేల్చి చెప్పడంతో రెబెల్ బెడద తప్పేలా లేదని అధికార పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అసలేం జరగిందంటే..?

భూపాలపల్లి నుండి ప్రాతినిథ్యం వహించిన సిరికొండ మధుసూధనాచారి గత ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. దీంతో ఆయనపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గులాభి కండువా కప్పుకున్నారు. అప్పటి నుండి ఇక్కడ రెండు వర్గాలుగా పార్టీ విడిపోయి ఎవరి కార్యకలాపాల్లో వారు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మధుసూధనాచారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, తాజా ఎన్నికల్లో గండ్ర వెంకట రమణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగిపోయింది. చారీకి టికెట్ ఇవ్వాలంటూ భూపాలపల్లిలో ఆందోళనలు కూడా చెలరేగాయి. చివరకు అధిష్టానం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగిపోయిందని అంతా భావించారు. ఇరువర్గాలు ఒక్కటయ్యాయని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు అంతా కలిసి పనిచేస్తారని పార్టీ శ్రేణులు భావించాయి.

తుపాను ముందు ప్రశాంతతేనా..?

అయితే ఓ వైపున అధికార పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. గులాభి శ్రేణులు కూడా పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముధసూధనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రిని, తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని, అప్పుడు కుటుంబ పాలన అని ఆరోపించిన జీవీఆర్ ఇప్పుడు తన కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. తన తండ్రి స్పీకర్ బాధ్యతల్లో ఉన్నందున పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించే అవకాశం లేదని తాము భూపాలపల్లి ప్రజలతో సంబంధాలు ఏర్పర్చుకుంటే తమ కుటుంబంపై ఆరోపణలు చేశారని, ఇప్పుడు జీవీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కీలక బాధ్యతల్లో ఎలా ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు సిరికొండ ప్రశాంత్. రమణారెడ్డి ఎమ్మెల్యేగా, ఆయన సతీమణి జడ్పీ ఛైర్ పర్సన్ గా, పార్టీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారని, వారి తనయుడు కూడా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావుపై కూడా సిరికొండ ప్రశాంత్ ఆరోపణలు చేశారు. ఆయన భార్య జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారని వీరిది కుటుంబ పాలన కాదా అని అడిగారు. బీసీ బిడ్డ అయిన తన తండ్రి మధుసూధనాచారిపై విమర్శలు చేసిన ఇద్దరు నాయకులు మాత్రం కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చారంటూ దుయ్యబట్టారు. తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానంటూ ప్రశాంత్ ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా తాను పనిచేస్తానని కూడా ఆయన వెల్లడించారు. దీంతో భూపాలపల్లి రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే సిరికొండ ప్రశాంత్ ఖచ్చితంగా పోటీ చేస్తారా లేక అధిష్టానం జోక్యం చేసుకున్న తరువాత వెనక్కి తగ్గుతారా అన్నది తేలాలంటే నామినేషన్ల ఉప సంహరణ వరకూ వేచి చూడాలి.

తెలంగాణ తొలిస్పీకర్ మధుసూధనాచారి తనయుడు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే వినండి

You cannot copy content of this page