దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లోని అభూజామఢ్ అటవీ ప్రాంతంలో బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయం నుండి ప్రారంభం అయిన ఎదురు కాల్పులు అడపాదడపా కొనసాగుతూనే ఉన్నాయి. నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని మాడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. కూంబింగ ఆపరేషన్ చేపట్టిన బలగాలు మావోయిస్టుల షెల్టర్ జోన్ ఏరియాకు చేరుకున్న నేపథ్యంలో ఈ ఎదురు కాల్పులు ప్రారంభం అయినట్టుగా బస్తర్ జోన్ పోలీసు అధికారులు వెల్లడించారు. కీకారణ్యాలతో పాటు పర్వత ప్రాంతాలు కావడంతో ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఎన్ కౌంటర్ జరుగుతోందని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో సమాచారం మాత్రం తెలియరావడం లేదు. మాడ్ అటవీ ప్రాంతంలో DRG, STF, BSF బలగాలు నక్సల్స్ ఏరివేత కోసం గాలింపు చర్యలు చేపట్టాయని ఇప్పటికే పలు మార్లు ఎదురు కాల్పులు జరిగాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి ఓ ప్రకటన విడుదల చేశారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తప్పించుకుంటూ పోలీసులపై కాల్పులు జరుపుతున్నారని దీంతో దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని తెలుస్తోంది.