ఎంట్రీ ఇచ్చిన విశ్వహిందూ పరిషత్…
శనివారం జగిత్యాల బంద్
దిశ దశ, జగిత్యాల:
చిలికి చిలికి గాలి వానలా మారిన ఓ ఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా తయారైంది. ఆర్టీసీ బస్సులో సీటు పంచాయితీ కాస్తా పోటాపోటీ ఆందోళనలకు దారి తీసింది. రాజీతో సద్దుమణగాల్సిన చిన్న విషయం రాద్దాంతం కావడం పోలీసు అధికారులకు తలనొప్పిగా మారింది. వర్గాల మధ్య విబేధాలకు దారి తీస్తున్న ఈ విషయంపై ఎలాంటి నిర్ణం తీసుకున్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎంఐఎం ఎంట్రీతో బీజేపీ అటాక్…
ముస్లిం యువతి ఆరోపణల నేపథ్యంలో ఎంఐఎం ఎంట్రీ ఇవ్వడంతో ఎస్సై అనిల్ ను జిల్లా యంత్రాంగం అటాచ్డ్ చేసిన సంగతి తెలిసిందే. మరునాడు ఎంఐఎం ఎమ్మెల్యే జగిత్యాలకు రావడం పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్దిసేపట్లోనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో నెటిజన్లు, యాదవ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ వంటి హిందుత్వ ఆర్గనైజేషన్లు అనిల్ కు బాసటనివ్వడం ఆరంభించాయి. బీజేపీ కూడా ఎస్సైపై చర్యలు తీసుకున్న తీరుపై తీవ్రంగానే మండిపడుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ లు ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు.
శనివారం బంద్…
ఎస్సై అనిల్ సస్పెన్షన్ వ్యవహారంపై విశ్వహిందూపరిషత్ మరో అడుగు ముందుకేసింది. వీహెచ్పీ, భజరంగ్ దళ్ జగిత్యాల శాఖ అధ్వర్యంలో శనివారం జగిత్యాల టౌన్ బంద్ కు పిలుపునిచ్చాయి. బలహీన వర్గాలకు చెందిన ఒక హఇందూ మహిళపై దాడి చేసి మతం రంగు పులుముతూ ఆమె భర్త ఎస్సైని సస్పెండ్ చేయించిన ఎంఐఎం కక్ష్య సాధింపులకు నిరసనగా బంద్ పాటించాలని పిలుపునిచ్చాయి. అనిల్ సస్పెన్షన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ కూడా చేస్తున్నాయి.
నా తప్పేమి లేదు… బంద్ తో సంబంధం లేదు: ఎస్సై అనిల్
మరో వైపున ఎస్సై అనిల్ విడుదల చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శనివారం నాడు ఇచ్చిన బంద్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, చట్టంతో పాటు తన అధికారులపై పూర్తి నమ్మకం ఉన్నందున తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తన తప్పేమి లేదని, శాంతి భద్రతల పరిరక్షణలో పని చేస్తున్న తన గురించి ఎలాంటి బంద్ లు పాటించాల్సిన అవసరం లేదని అనిల్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం నుండి నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.