ఆది మానవుల కాలంలో ఆహారంగా తీసుకునే విధానం ఎలా ఉండేది..? వంట చేసుకుని తినే విధానం ఎప్పుడు మొదలైంది..? పచ్చి ఆహారం కాకుండా ఉడికించినవి తినాలన్న విషయాన్ని గ్రహించింది ఎప్పుడో తెలుసా..? ఈ విషయాలపై ఇంకా పరిశోధనలు జరుపుతున్నప్పటికీ ఇప్పటికైతే ఎన్నోఏళ్ల క్రితమోనన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు పరిశోధకులు. పచ్చి కూరగాయలు, మాంసాన్ని ఆది మానవులు తినేవారని చరిత్ర చెప్తోంది. అయితే ఆహారపదార్దాలను ఉడికించుకుని తినాలన్న విషయాన్ని ఆది మానవుల కాలంలో ఎప్పుడు గుర్తించారన్నది మాత్రం మిస్టరీగానే మారింది. మానవుల జీవన విధానంలో వచ్చిన మార్పులపై జరుగుతున్న పరిశోధనలతో ఇదిమిద్దంగా ఓ క్లారిటీకి వస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. తొలిసారిగా మానవుడు వంట చేసుకునే పద్దతిని దాదాపు 170,000 సంవత్సరాల క్రితం ప్రారంభించాడని పరిశోధకులకు గతంలో తేల్చారు. అప్పుటి నుండే మాంసాన్ని ఉడికించుకోవడం ప్రారంభమైందని గత అధ్యయనాలు స్పష్టం చేశాయి. అయితే తాజాగా వెల్లడైన పరిశోధనలు అంతకు ముందే మానవులు వంట చేసుకుని తినే విధానాన్ని పాటించారని చెప్తున్నాయి.
ఇజ్రాయిల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం 780,000 సంవత్సరాల క్రితం నివసించిన మానవులు వంటలు చేసుకుని భుజించే పద్దతుల పాటించారని చెప్తున్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడంతో కొంత వివాదస్పదంగా మారినట్టుగా కూడా తెలుస్తోంది. నార్త్ ఇజ్రాయిల్‌లోని గెషర్ బెనోట్ యాకోవ్‌లో కనుగొన్నచేపల అవశేషాల ఆధారంగా చేసిన 16ఏళ్ల పరిశోధనలు మాత్రం 7 లక్షల 80 వేల ఏళ్ల క్రితమే వండుకునే పద్దతిని అవలంభిచారని రచయిత టెల్ అవీవ్ పేర్కొన్నారు. స్టెయిన్‌హార్డ్ యూనివర్శిటీ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త ఇరిట్ జోహార్ వివరిస్తూ… జోర్డాన్ నది ఒడ్డున ఒకప్పుడు సరస్సు ఉండేదని అక్కడ ఉన్న పురాతన చేపల శిలాజాలు తమకు పరిశోధన చేయడంలో సహాయపడ్డాయన్నారు. సరస్సు ప్రాంతంలో లభ్యమైన శిలాజాల్లో ఎముకలు లేకపోవడం ఓ ఎత్తైతే, అక్కడ దొరికిన దంతాలు తమ పరిశోధనలకు కీలకమైన ఆధారంగా భావించామన్నారు. రెండు మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉన్న రెండు పెద్ద జాతుల కార్ప్‌ల(ఆయిలీ ఫ్రెష్‌వాటర్ ఫిష్) నుంచి కనుగొన్నామని సైంటిస్ట్ చెప్తున్నారు. అక్కడే తమ సహ పరిశోధకుడు కాలిపోయిన ఫ్లింట్‌లు(రాళ్లు), పొయ్యి ఉనికిని సూచించే ఇతర సాక్ష్యాలను కనుగొన్నట్లు వివరించారు. 500 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో చేపలను వండుకున్నారని, వాటి ఎముకలు మృదువుగా ఉండడంతో అవి కరిగిపోయి ఉంటాయని, పళ్ళు మాత్రమే మిగిలి ఉండటాన్ని బట్టి గమనిస్తే వంట చేసుకున్నట్టు అర్థమవుతోందని సైంటిస్ట్ వివరించారు. దంతాల ఎనామిల్ ఆధారంగా అధ్యయనం చేసిన తరువాతే ఆది మానవులు వంటలు చేసుకునే పద్దతిని 7.80 లక్షల ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారని భావిస్తున్నామన్నారు. ఇందుకోసం లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో లభ్యమైన ఎక్స్-రే ఫౌడర్ డిఫ్రాక్షన్‌ను ఉపయోగించి నిర్దారణ చేసుకున్నామన్నారు. సరస్సులో గుర్తించిన చేపల శిలాజాలతో ఎనామిల్‌ను వేడి చేసిన తర్వాత స్ఫటికాల నిర్మాణంలో వచ్చిన మార్పులను కూడా పోల్చారు. ఈ క్రమంలో సరస్సు ప్రాంతం నుంచి సేకరించిన దంతాలు 200-500 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతకు లోబడి ఉన్నాయన్నారు. అయితే ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలు మానవుడు ఇన్నేళ్ల క్రితం వండుకుని భుజించే పద్దతులను పాటించినట్టుగా చెప్తున్నప్పటికీ పరిశోధకులు ఇంకా తమ శోధన కొనసాగిస్తూనే ఉన్న నేపథ్యంలో ఇదే తుది నిర్ణయం కాకపోవచ్చు. గతంలో 1.70 లక్షల సంవత్సారల క్రితం మానవులు వంట చేసుకునే పద్దతిని ప్రారంభించారని పరిశోధనలు తేల్చగా తాజాగా ఇజ్రాయిల్ సైంటిస్టులు చేసిన పరిశోధనలు 6 లక్షల ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే రిసెర్చ్ కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నందున వారు గుర్తించిన అంశాలు ఏమిటో వివరించే అవకాశమూ లేకపోలేదు.