నాలుగో వంతు పిల్లర్లపై ప్రభావం… పది పిల్లర్ల వరకూ తొలగించాల్సిందే…

కాపర్ డ్యాం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం

దిశ దశ, హైదరాబాద్:

ఒక పిల్లర్ కుంగిపోవడంతో ఏకంగా దాని ప్రభావం బ్యారేజీలోని దాదాపు నాలుగోవంతు పిల్లర్లపై దీని ప్రభావం పడనుందని ప్రాథమికంగా నిర్ధారించారు. బ్యారేజీ డ్యామేజీకీ కారణం ఏదైనా తెలంగాణ ప్రభుత్వంపై మాత్రం అదనపు ఆర్థిక భారం పడినట్టేనని స్పష్టం అవుతోంది. మూడు రోజుల పాటు తెలంగాణాలో పర్యటించిన కేంద్ర నిపుణుల బృందం ప్రాథమికంగా నిర్దారణకు వచ్చిన కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి, అయితే పూర్తి నివేదిక నిపుణుల బృందం కేంద్ర జలశక్తి విభాగానికి రెండు మూడు రోజుల్లో అందించనుంది. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని నిపుణుల బృందం వ్యక్తం చేస్తోంది.

కాపర్ డ్యాం ప్రతిపాదన…

బ్యారేజీ ఎగువ ప్రాంతం నుండి ఏటా లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండేళ్లలో ఈ వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో వాటర్ ఫ్లోటింగ్ ప్రభావం నేరుగా మేడిగడ్డ బ్యారేజీపై పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా కాపర్ డ్యాంను నిర్మించాలని కేంద్ర నిపుణుల కమిటీ సూచించింది. రూ. 100 కోట్లతో కాపర్ డ్యాంను ఇటు తెలంగాణ నుండి వచ్చే వరద ఉధృతి తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో కాపర్ డ్యాం తట్టుకుట్టుందా లేదా అన్న అంశంపై కూడా అధ్యయనం చేయాల్సి ఉన్నట్టుగా నిర్మించినట్టయితే మేడిగడ్డపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉండదని దీనివల్ల బ్యారేజీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్తున్నట్టు సమాచారం. అయితే అటు మహారాష్ట్ర, తెలుస్తోంది. మేడిగడ్డ ఎగువన నిర్మించే ఈ కాపర్ డ్యాం వల్ల మెయిన్ కెనాల్ మీదుగా వచ్చే వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలవరం తరహాలో అయితే కాపర్ డ్యాం మేడిగడ్డ వద్ద అవసరమని నిపుణులు చెప్తున్నప్పటికీ… కాపర్ డ్యాం నిర్మాణం జరిగిన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న అంశం కూడా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉన్నట్టుగా బృందం చెప్పింది.

పిల్లర్ల తొలగింపు మస్ట్…

అయితే 7వ బ్లాక్ లోని 20వ పిల్లర్ వద్ద వర్టికల్ క్రాక్ ఏర్పడిందని కేంద్ర నిపుణల బృందం గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే దీని ప్రభావం 7వ బ్లాకుకే పరిమితం కాకుండా 5, 6, 8,9 బ్లాకులపై కూడా తీవ్రంగా పడనుందని అంచనా వేశారు. దీనివల్ల 15 నుండి 21 పిల్లర్లపై డ్యామేజీ ప్రభావం ఉంటుందని వీటిలో తీవ్రమైన ప్రభావం పడుతున్న పది పిల్లర్ల స్థానంలో కొత్తవి నిర్మించాల్సిందేనని, మిగతా వాటికి శాశ్వతంగా సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేవిధంగా మరమ్మత్తులు చేయాల్సి ఉంటుందని నిపుణులు భావించినట్టుగా సమాచారం. రూ. 10 వేల కోట్ల పై చిలుకు వెచ్చించి నిర్మించిన బ్యారేజ్ ని బాగు చేసేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇచ్చిన సూచనలు అమలు చేసేందుకు వందల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా చేపట్టాల్సిన పనులు పూర్తి కావాలంటే ఆరు నెలల వరకు సమయం పడుతుందని భావిస్తున్నారు.

సమగ్రంగా ఆరా…

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మొత్తం బ్యారేజీలపై డీపీఆర్​లతో పాటు సాంకేతిక అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలను డ్యాం సేఫ్టీ బృందం పరిశీలించింది. ఇరిగేషన్, నిర్మాణ కంపెనీ అయిన ఎల్ అండ్ టి ఇంజనీర్లతో సుదీర్ఘంగా దీనిపై చర్చించింది. సెంట్రల్​ డిజైన్​ ఆర్గనైజేషన్​ ఏ విధమైన డిజైన్​ ఇచ్చిందనే వివరాలను కేంద్రం బృందం సేకరించినట్టుగా తెలుస్తోంది. సీడీఏ నివేదికల ప్రకారం నిర్మాణ కంపెనీ పని చేసిన తీరు, నాణ్యత ప్రమాణాల పాటించిన తీరు గురించి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ అంశంలో సెంట్రల్​ ఆఫ్​ గ్రావిటీ తప్పిదాలు కూడా ఉన్నట్టగా బృందం ప్రతినిధులు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. పిల్లర్ల నిర్మాణ సమయంలో గ్రావిటీ లోతును సరిగా అంచనా వేయలేదా అను కోణంలోనూ ఆరా తీసిన నిపుణులు, గ్రావిటీ లోతును అంచనా వేయలేకపోయారని, దీనివల్ల పైపింగ్ యాక్షన్ తో డ్యాం పిల్లర్ వర్టికల్ క్రాక్ వచ్చి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. మరో వైపున నీటి ప్రవాహాపు ధాటి వల్ల కూడా పిల్లర్లు కుంగిపోయే అవకాశాలు కూడా లేకపోలేదన్న అంశాన్ని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు వ్యాఖ్యానించినట్టు సమాచారం.

ప్రాజెక్టునిర్మాణంలో లోపాలు లేవు

డ్యాం సేఫ్టీ నిపుణుల కమిటీకి స్టేట్ ఇరిగేషన్ అధికారులు కూడా పలు అంశాలను వివరించినట్టుగా తెలుస్తోంది. ​ఈఎన్‌సీలు ముర‌ళీధ‌ర్, నాగేంద్రరావు, వెంక‌టేశ్వర్లు, ఓఎస్‌డీ శ్రీధ‌ర్ రావు దేశ్‌పాండేతో పాటు ఎల్ అండ్ టీ ప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, నిర్మాణం చేపట్టిన సమయంలో ఎదురైన సవాళ్లతో పాటు వాటిని అధిగమించేందుకు నిపుణలతో చేపట్టిన సంప్రదింపుల గురించి కూడా వివరించినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ సమయంలో తాము తీసుకున్న చర్యలు భవిష్యత్తులో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకే ప్రాధాన్యత ఇచ్చామని తెలియజేసినట్టు సమాచారం. అయితే ఏడో బ్లాక్‌లో సమస్యకు ప్రధాన కారణం అయితే నిర్మాణంలో తప్పిదం అయితే కాదని వివరించినట్టు తెలిసింది. నదిలోని ఇసుక వల్ల పిల్లర్ డ్యామేజీ అయి ఉంటుందన్న అభిప్రాయాలు తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు వ్యక్తం చేశారు. వ‌ర‌ద పూర్తిగా త‌గ్గిన త‌ర్వాత న‌వంబ‌ర్‌లో స‌మగ్రంగా ప‌రిశీలిస్తామని ఈఎన్సీలు చెప్పినట్టు సమాచారం.

రెండు రోజుల్లో నివేదిక

మూడు రోజలు పాటు తెలంగాణాలో పర్యటించిన జాతీయ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందం సమగ్రంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ లు, ఇతరాత్ర డాక్యూమెంట్లతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన అంశాలను క్రోడీకరించి నివేదికను తయారు చేయనున్నారు. ఈ నివేదికను రెండు రోజుల్లో జలశక్తి విభాగానికి అందజేయనున్నట్టు తెలుస్తోంది.

You cannot copy content of this page