క్యాట్ కోసం కాప్స్ సెర్చింగ్

సాధారణంగా పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే కేసుల్లో చోరీలు, మిస్సింగ్‌ కేసులు కూడా ఉంటాయి. అయితే వీటిల్లో ఎక్కువగా ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియన వ్యక్తులు చోరీకి పాల్పడ్డారనో… ఆభరణాలు ఎత్తుకెళ్లారనో ఇలా రకరకాలుగా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. ఇందులో పోలీసులు కూడా రంగంలోకి దిగి కేసులను ఛేదిస్తుంటారు. నిందితులను అదుపులోకి తీసుకుని సొత్తు రికవరి చేస్తుండడం సహజం. అయితే హైదరాబాద్‌లో నమోదయిన వింత కేసు పోలీసులను సరికొత్త అన్వేషన చేయించే పని పెట్టింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి మహానగరాన్ని జల్లెడ పడుతున్నారు. అంత విలువైన వస్తువు ఏంటీ, ఆ వస్తువు కోసం పోలీసులు అంతసీరియస్ గా సెర్చ్ చేయడం వెనక కారణాలేంటీ అనే కదా మీ డౌట్? మిస్సయిందో లేక చోరీకి గురైందో ఆభరణమో లేక మనుషులో కాదు… ఓ పిల్లి మాత్రమే. అదేంటి పిల్లి కోసం అంతలా వెతకాల్సిన పనేంటని, అపశకునంగా భావించే పిల్ల కోసం అంతలా ఇబ్బంది పడడం ఏంటన్న డౌటనుమానం వెంటనే రావచ్చు మీకు. కానీ ఎంతో స్పెషాలిటీతో జన్మించిన ఈ పిల్లి అంటే దాని యజమాని ఎనలేని మక్కువ కావడం వల్లే దాని కోసం అన్వేషన తప్పడం లేదు. వనస్థలిపురం ప్రాంతంలోని జహంగీర్ కాలనీకి చెందిన షేక్ అజహర్ మహమూద్ ఫ్యామిలీ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లిని ఆదివారం అర్థరాత్రి అగంతకులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఇంటి పరిసరాలతో పాటు కాలనీ అంతటా వెతికినా దాని ఆచూకీ లభించకపోవడంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అరుదైన జాతికి చెందిన ఈ పిల్లిని షేక్ అజహర్ మహమూద్ రూ.50 వేలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఓ కన్ను గ్రీన్, మరో కన్ను బ్లూ కలర్‌లో ఉండటమే ఈ పిల్లి ప్రత్యేకత. దీనికి ముద్దుగా నోమణి అని నామకరణం చేసుకున్నారు షేక్ అజహర్ మహమూద్. డిఫరెంట్ లుక్ ఇచ్చే నోమణిని ఎత్తుకెళ్లడంతో షేక్ అజహర్ మహమూద్ తల్లడిల్లిపోతున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కోలా సత్యనారాయణ తెలిపారు. పిల్లి కోసం కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో కూడా ఆరా తీస్తున్న పోలీసులు నోమనిని అజహర్ మహమూద్ కు అప్పగించే పనిలో నిమగ్నం అయ్యారు.

You cannot copy content of this page