నీటి పారుదల శాఖ అవినీతి పరవళ్లు…

అడ్డంగా బుక్కయిన ఇద్దరు ఉద్యోగులు

దిశ దశ, సుల్తానాబాద్:

నీటి పారుదల శాఖలో అవినీతి పరవళ్లు తొక్కింది. తమ సహచర ఉద్యోగి అని కూడా చూడకుండా లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు ఉద్యోగులు. ఏసీబీ కరీంనగర్ రేంజ్ డీఎస్పీ రమణ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఇరిగేషన్ విభాగం ఆరవ డివిజన్ ఈఈ కార్యాలయంలో పని చేస్తున్న ఒకరు 88 రోజుల పాటు సిక్ లీవుపై వెళ్లారు. తిరిగి డ్యూటీలో చేరిన తరువాత నిబంధనల ప్రకారం తనకు హావ్ పే లీవ్ గా పరిగణించాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించిన వేతన బిల్లు సిద్దం చేయాలని సూపరింటిండెంట్ దుంపల శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ మహదేవుని సురేష్ లను అభ్యర్థించాడు. అయితే లంచం ఇస్తేనే తప్ప బిల్లుకు మోక్షం కల్గించమని తేల్చి చెప్పడంతో బాధిత ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో బుధవారం సుల్తానాబాద్ లో రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. సూపరింటిండెంట్ దుంపల శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ మహదేవుని సురేష్ లకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా నిర్దారణ అయింది. దీంతో వీరిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

You cannot copy content of this page