అవిశ్వాసం నోటిసు ఇచ్చిన కౌన్సిలర్లు
దిశ దశ, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అధికార పార్టీలో అసమ్మతి రాగం ముదిరి పాకనపడినట్టుంది. మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అధికారులకు అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఒంటెత్తు పోకడలకు నిరసనగా తాము అవిశ్వాసం పెడుతున్నామని వారు ప్రకటించారు. 30 మంది కౌన్సిలర్లకు గాను 20 మంది అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేయడం గమనార్హం. తాము పదవులు చేపట్టి మూడేళ్లు అవుతున్నా వార్డుల్లో ఎలాంటి అభివృద్ది చేపట్టలేదని దీంతో ప్రజల్లో తమపై చులకన వ్యక్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో తమను విస్మరిస్తూ అగౌరపరుస్తున్నారని వారు ఆరోపించారు. వీటన్నింటి నేపథ్యంలోనే తాము మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాసం ప్రకటిస్తున్నామని వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు భూపాలపల్లి జిల్లాలోనూ వ్యతిరేకతను ప్రదర్శిస్తుండడం అధిష్టానానికి మరో తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మాణాలకు నోటీసులు ఇవ్వగా ఆ జాబితాలో తాజాగా భూపాలపల్లి కూడా చేరింది. ఈ విషయంపై జిల్లా నాయకత్వం ఎటువంటి ఎత్తుడగలతో ముందుకు సాగనుందోనన్నదే చర్చనీయాంశంగా మారింది.