దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ దండకారణ్యంలో మళ్లీ ఎదురు కాల్పులు ఘటన చోటు చేసుకుంది. బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం. నారాయణపూర్ జిల్లాలోని అభూజామఢ్ అటవీ ప్రాంతంలో బుధవారం మద్యాహ్నం ఒంటిగంట నుండి ఎదురు కాల్పులు ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలకు, నక్సల్స్ కు మధ్య పలు మార్లు కాల్పులు జరిగినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. నారాయణపూర్ సరిహధ్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందుకున్న డీఆర్జీ, సీఆర్ఫీఎఫ్ తో పాటు పలు విభాగాలకు చెందిన బలగాలు మంగళవారం కూంబింగ్ చేపట్టాయి. కీకారణ్యాల్లో బలగాలు, నక్సల్స్ తారసపడిన వెంటనే ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అక్కడి నుండి మావోయిస్టులు అడవుల్లోకి వెల్లిపోతుండడంతో ఆగిపోతున్నాయని పోలీసులు చెప్తున్నారు. వారిని వెంబడిస్తూ బలగాలు అటవీ ప్రాంతంలోకి చొచ్చుకపోతున్న క్రమంలో పలుమార్లు కాల్పులు సంభవించాయని పోలీసు వర్గాలు వివరించాయి. అయితే పూర్తి వివరాలు తెలియరావల్సి ఉందని బస్తర్ ప్రాంత పోలీసు అధికారులు తెలిపారు.