దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్యంలో గురువారం ఉదయం నుండి కాల్పుల మోత దద్దరిల్లిపోతోంది. తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహధ్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన డీఆర్జీ బలగాలు, దంతెవాడకు చెందిన కోబ్రా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఎదురు పడ్డారు. దక్షిణ బస్తర్ పరిధిలోని ఈ అటవీ ప్రాంతంలో మూడు జిల్లాలకు చెందిన నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారం అందుకున్న బలగాలు ఏరివేత కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న క్రమంలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు అడపాదడపా నక్సల్స్, బలగాల మధ్య పలుమార్లు కాల్పులు జరిగాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు నలుగురు నక్సల్స్ చనిపోయినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.