నకిలీ పత్తి విత్తనాల విక్రేతల అరెస్ట్

కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు

దిశ దశ, కరీంనగర్:

రైతులను నట్టేట ముంచేందుకు రంగం సిద్దం చేసుకున్న ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాయ మాటలు చెప్పి, బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లు వేసి మోసం చేయాలని పన్నాగం పన్నిన వ్యాపారులను కటకటాలకు పంపించారు. మంగళవారం కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తనాబాద్ కు చెందిన నూక రాజేశం, పెద్దపల్లికి చెందిన సతీష్ వరంగల్ నగరంలోని మట్టెవాడకు చెందిన వేద ప్రకాష్ లు ఓ ముఠాగా ఏర్పడి పత్తి విత్తనాలను కల్తీ చేసి రైతులను నట్టేట ముంచేందుకు పథకం రచించుకున్నారు. గడువు తీరిన బిజి 2వ రకం పత్తి విత్తనాలను బిజి 3 రకానికి చెందినవని చెప్పి విక్రయించాలని రంగం సిద్దం చేసుకున్నారు. టీఎస్ 04, ఈఎల్ 7185 నెంబరు కారులో ప్రయాణిస్తుండగా వీరిని మానకొండూరు రోడ్డులో పట్టుకున్నారు. లక్ష రూపాయల విలువ చేసే పత్తి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోగా, అష్టలక్ష్మీ లేబుళ్లు అంటించిన 19 బాక్సులు, సాయి దివ్య పేరిట అంటించిన 31 బాక్సులు, 10 ఖాలీ ప్యాకెట్లను సీజ్ చేశారు. నిందితుల్లో పెద్దపల్లికి చెందిన సతీస్ పరారీలో ఉన్నట్టు సీపీ సుబ్బారాయుడు వెల్లడించారు.

వ్యాపారంలో నష్టపోయి…

ఈ ముగ్గురు కూడా గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వ్యాపారం చేసి నష్టపోవడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు నకిలీ పత్తి విత్తనాల దందా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వ్యాపారం చేసినప్పుడు ఏర్పడిన పరిచయాలను ఆసరగా తీసుకుని నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి డబ్బు గడించాలని స్కెచ్ వేసుకున్నారు. అధిక దిగుబడులు వస్తాయని ఆశ చూపించి విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించారు. అయితే కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు వీరిని అరెస్ట్ చేయడంతో వారి పన్నాగానికి ఆదిలోనే చెక్ పడినట్టయింది.

పీడీ యాక్ట్ పెడతాం: సీపీ సుబ్బారాయుడు

రైతులను మోసం చేసేందుకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్టు కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. రైతులు కూడా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేసేప్పుడు అన్నిరకాల జాగ్రత్తలు పాటించాలని, అవి అసలైనవో నకిలీవో గమనించాలని సీపీ సూచించారు. మాయ మాటలు చెప్పి రైతులను మోసగించే వారిపై క్రిమినల్ కేసు పెడ్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయ సారథి, ఇన్స్ పెక్టర్లు సృజన్ రెడ్డి, యం రవి కుమార్, మానకొండూరు సీఐ రాజ్ కుమార్, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డిలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నకిలి పత్తి విత్తనాల గుట్టును రట్టు చేశారు.

You cannot copy content of this page