రెండో ప్రాధాన్యత లెక్కింపు స్టార్ట్…

దిశ దశ, కరీంనగర్:

పట్టభద్రులు నిర్ణయం ఏ అభ్యర్థికి మొగ్గు చూపనట్టుగా తేలింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తామని కలలు కన్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. 11 రౌండ్లలో 2.23 లక్షల ఓట్లను లెక్కించిన కౌంటింగ్ అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు.  మంగళవారం మద్యాహ్నం 11.30 గంటలకు ప్రారంభం అయిన ఓట్ల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటల వరకూ సాగింది. అధికారిక ప్రకటన తరువాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అయింది.

ఓట్ల వివరాలిలా…

తొలి ప్రాధాన్యతలో మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75675, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 70565, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60419 ఓట్లు వచ్చాయి. 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉన్నందున పోటీలో ఉన్న వారిలో ఎవరికి కూడా పోలైన ఓట్లలో 50 శాతం దాటలేదు. అయితే ప్రధాన పోటీ ఉన్న ముగ్గురు అభ్యర్థులు 2లక్షల 6 వేల 659 ఓట్లను షేర్ చేసుకోగా, మిగతా అభ్యర్థులంతా కలిపి 12 నుండి 15 వేల వరకు తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. చివరి రౌండ్ పూర్తయిన తరువాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5110 ఓట్ల లీడ్ లో ఉండగడా రెండో స్థానంలో నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న అభ్యర్థులు తమకే లాభిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ తొలి ప్రాధాన్యత ఓట్ల ఫలితాలను గమనించిన తరువాత ఒకింత ఆందోళన చెందుతున్నట్టే కనిపిస్తోంది. అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేయడంతో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తరువాత విజేత తేలే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసిన పట్టభద్రులు కొన్ని ప్రాంతాల్లో తొలి ప్రాధాన్యతతోనే సరిపెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అనుకున్నంత స్థాయిలో వస్తాయా లేదా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

నామ మాత్రంగా స్వతంత్రులు

50మందికి పైగా స్వంతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ వారందరికి కలిపి వచ్చిన ఓట్లు చెల్లని ఓట్ల కంటే తక్కువగా ఉన్నాయంటే వారు ఏ స్థాయిలో ప్రభావం చేశారో అర్థం చేసుకోవచ్చు. మొదట గుర్తించిన తొలి చెల్లని వాటితో పాటు తొలి ప్రాధాన్యత క్రమంలో కూడా గుర్తించిన చెల్లని ఓట్లను మరోసారి పరిశీలన చేసిన తరువాత విజేతకు అవసరమైన ఓట్లు ఎన్ని రావాలో తేల్చే అవకాశం ఉంది. 2.24 లక్షల ఓట్లు పోలయినట్టుగా గుర్తించినప్పటికీ చెల్లని ఓట్లను పరిశీలించిన తరువాత 50 శాతానికి కావల్సిన ఓట్ల లెక్క తేల్చారు అధికారులు. కోటా ఓట్లు లక్షా 11 వేల 672 ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలవనున్నారు. మొత్తం ఓట్లు 2లక్షల 23 వేల 343 ఓట్లను పరిగణనలోకి తీసుకోగా 28686 ఓట్లు చెల్లనివిగా నిర్దారించారు. ప్రధాన పోటీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే సాగుతుండడంతో మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేషన్ చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. లక్షా 11 వేల పై చిలుకు ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉండడంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ మండలిలో అడుగు పెడ్తారోనన్న ఉత్కంఠత నెలకొంది.

ఆ ఇద్దరు…

ట్రస్మా నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన యాదగిరి శేఖర్ రావుకు తన సంఘంతో అనుబంధం పెనవేసుకున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కూడా అండగా నిలబడనట్టుగా స్పష్టం అవుతోంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ట్రస్మా యూనియన్ లో సభ్యులుగా ఉన్న పాఠశాలల ప్రతినిధులు పూర్తి స్థాయిలో అక్కున చేర్చుకోనట్టుగా స్పష్టం అవుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో 4 వేల లోపు ఓట్లు మాత్రమే పడ్డాయి. 50 వేల వరకు ఓట్లు వస్తాయని ఆశించిన యాదగిరి శేఖర్ రావుకు తను నిర్మించిన ట్రస్మా సంస్థ ప్రతినిధులే సహకరించనట్టుగా తేలిపోయింది. ఇకపోతే స్థానిక సంస్థల ద్వారా మండలిలో అడుగు పెట్టాలని ప్రయత్నించి విఫలం అయిన సర్దార్ రవిందర్ సింగ్ విషయంలోనూ ఓటర్లు ఆసక్తి చూపలేదు. బీఆర్ఎస్ పార్టీ మొదట తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నా కూడా టికెట్ ఆశించిన రవిందర్ సింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తనకు సొంత పార్టీతో పాటు న్యాయవాద వృత్తిలో ఉన్నందు తన ప్రొఫెషన్ కూడా సానుకూలంగా ఉంటుందని ఆశించినట్టుగా మాత్రం ఆయనను అక్కున చేర్చుకున్నట్టుగా అనిపించడం లేదు.

You cannot copy content of this page