వాస్తవాలు కప్పి పుచ్చుతూ…

ఇరిగేషన్ అధికారుల తీరే విచిత్రం

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగినంత పనిచేశారు ఇరిగేషన్ అధికారులు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్ని అవాస్తమంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. అన్నారం బ్యారేజీకి పడిన బుంగ విషయంలో వచ్చిన కథనాలపై కౌంటర్ అటాక్ చేసిన తీరు అందరినీ విస్మయ పరిచింది. బ్యారేజీకి ఏమీ ఢోకా లేదని, అదంతా మెయింటనెన్స్ లో భాగమేనని ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రకటనలు చేశారు. అయితే తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఇచ్చిన నివేదికలు ఇరిగేషన్ అధికారులు తప్పిదాలను ఎత్తి చూపాయి. సాంకేతికంగా ఎదురైన లోపాల గురించి సమగ్రమైన అధ్యయనం చేయకుండానే ఇష్టారీతిన సోషల్ మీడియాపై ఫైర్ అవుతూ కాలయాపన చేశారు. అంతేకాకుండా ఈ నెల 2న అన్నారం బ్యారేజీకి దిగువన పడ్డ బుంగలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం 24 గంటల్లోగానే నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలన్ని కూడా ఒకే డిజైన్ తో నిర్మించారని వాటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిందేనని, ఇందుకు అన్నారం బ్యారేజీ దిగువన పడ్డ బుంగలే నిదర్శనం అంటూ ఆ నివేదికలో వ్యాఖ్యానించింది. వాస్తవంగా మెయింటనెన్స్ అంటే గేట్లు, మిషనరీ వంటి వాటిల్లో టెక్నికల్ సమస్యలు రాకుండా చూసుకుంటారు. కాని ఇక్కడ అన్నారం బ్యారేజీ కింది భాగం నుండి దిగువ ప్రాంతానికి నీరు ఉబికి వస్తూ బుంగలు ఏర్పడ్డాయి. అంటే బ్యాక్ వాటర్ బ్యారేజీని దాటి వస్తోందని తేలిపోయింది. గతంలో కూడా ఇలాంటి సమస్యే ఎదురయితే ఢిల్లీ నుండి ప్రత్యేకంగా నిపుణులను రప్పించి భారీ మొత్తంలో నిధులు వెచ్చించి సరిదిద్దామని అధికారులే చెప్తున్నారు. అయితే అప్పుడు ఈ సమస్య అక్కడికే పరిమితం అయిందా డ్యాం నిర్మాణం చేపట్టిన ప్రాంతం అంతటా ఎదురవుతుందా అన్న విషయంపై దృష్టి పెట్టక పోవడం, భవిష్యత్తులో ఇలాంటి అవాంతరం ఎదురయ్యే అవకాశాలు ఉంటే ఎలా అని ఆలోచించి అందుకు తగిన చర్యలు తీసుకున్నట్టయితే ఇంత దూరం వచ్చేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గత సంవత్సరం కూడా ఇలాంటి బుంగలు డ్యాంకు దిగువ భాగాన పడ్డాయని తాము అప్పటికప్పుడు ఇసుక బస్తాలు, కాంక్రీట్ వేసి సమస్యను అధిగమించామని కూడా అధికారులు ప్రచారం చేస్తూ వచ్చారు. ఇసుక రావడం లేదు కాబట్టి ప్రమాదం ఉండదని కూడా వాదిస్తూ అన్నారం గురించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన వారిని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. అసలు బ్యారేజీ బేస్ దాటి నీరు దిగువకు ఎలా వస్తోంది అన్ని ఒకే ఒక విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఇదంతా కామన్ అంటూ దాటవేత ధోరణి అవలంభించడం అందరినీ ఆశ్యర్యానికి గురించేసింది. తాజాగా కేంద్ర నిపుణుల బృందం ఇచ్చిన నివేదికతో అధికారులు చేసిన వాదనలన్ని కూడా తప్పేనని తేటతెల్లం కావడం గమనార్హం.

ఆ కేసు క్లోజేనా..?

ఇకపోతే మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోయిన అంశం గురించి వాస్తవానికి భిన్నంగా వ్యవహరించారని స్పష్టం అయింది. వెనకా ముందు ఆలోచించకుండా అగంతకులు వచ్చి బ్యారేజీకి డ్యామేజీ చేశారన్న ఫిర్యాదు చేయించారు. బ్యారేజీలో భారీ శబ్దం వచ్చిందని కూడా ఫిర్యాదులో రాయించి మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వ ఆస్థి కావడంతో పోలీసులు కూడా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిర్మాణంలో రికార్డులు క్రియేట్ చేసిన సీనియర్ ఇంజనీర్లు, నిపుణులు ఉన్నా కూడా హాడావుడిగా ఫిర్యాదు ఎందుకు చేసినట్టో అన్నదే మిస్టరీగా మారింది. దీని వెనక ఎదో జరిగింది అన్న అనుమానాలు వ్యక్తం చేసిన ఇరిగేషన్ అధికారులు అసలు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతరాష్ట్ర రహదారిగా మేడిగడ్డ బ్యారేజీ వారధిని ఉపయోగిస్తున్నందున ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఇక్కడే ప్రత్యేకంగా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. నగదు రవాణా, అసాంఘీక శక్తులను కట్టడి చేసేందుకు పోలీసులు మేడిగడ్డ వద్ద భారీ బందో బస్తు నడుమ చెక్ పోస్టు నిర్వహిస్తున్న సమయంలో అగంతకులు బ్యారేజీ వద్దకు వచ్చి విధ్వంసానికి పాల్పడేంత సాహసం చేస్తారా అన్న లాజిక్ మిస్సయ్యారు ఇరిగేషన్ అధికారులు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అటు వైపు నుండి మావోయిస్టులు రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బలగాలు డేగ కళ్లతో నిఘాను కట్టుదిట్టం చేయడమే కాకుండా కూంబింగ్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నాయి. సరిహద్దు గ్రామాల్లో భూపాలపల్లి జిల్లా పోలీసులు అప్రమత్తత చర్యలు పకడ్బందీగా చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అగంతకులు డ్యాం వద్దకు చేరుకునే అవకాశం ఉంటుందా అన్నది గమనించాల్సిన అంశం. అంతేకాకుండా బ్యారేజీని నాశనం చేయాలన్న లక్ష్యంతో అసాంఘీక శక్తులు రంగంలోకి దిగినట్టయితే 7వ బ్లాక్ వరకు వచ్చి 20వ పిల్లర్ కింది భాగం వరకూ వెల్లి విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారా అన్నది జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. మరోవైపున విధ్వంసకారులు మందుగుండు సామాగ్రి తప్ప మరో రకంగా బ్యారేజీని నాశనం చేసే అవకాశాలు లేవు. బ్లాస్టింగ్ మెటిరియల్ ఉపయోగించినట్టయితే దాని ప్రభావం ఆ పిల్లర్ల వరకే పరిమితం అయ్యే అవకాశాలు ఉండవు. బ్యాక్ వాటర్ కూడా ఎగిరిపడి చుట్టు పక్కల పంట భూముల్లోకి వచ్చి చేరేది. అంతేకాకుండా పేలుడు ప్రభావం సమీప గ్రామాలపై కూడా పడే అవకాశాలు ఉండేవి. కనీసం విస్పోటనం తాలుకు శబ్దం అయినా సమీప గ్రామాల్లో వినిపించేంది. కానీ ఈ శబ్దం, పేలుడు ప్రభావం మాత్రం 7వ బ్లాక్ లోని పిల్లర్లకే పరిమితం కాగా దాని ప్రభావం వంతెన పై పడడంతో వంతెన కూడా కుంగిపోయింది. కాంక్రీట్, స్టీల్ ఉపయోగించి నిర్మించిన భారీ సైజు పిల్లర్ బేస్ పోయిన తరువాత అందులో కదలిక వచ్చినప్పుడు ఇలాంటి శబ్దాలు రావడం కామన్ అన్న విషయం ఇరిగేషన్ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. అలాగే విధ్వంస కారులు డ్యాం మీదుగా కాకుండా నీళ్లలో వచ్చి విధ్వంసానికి పాల్పడే ప్రయత్నం చేసినట్టయితే 10 టీఎంసీల వరకు ఉన్న బ్యాక్ వాటర్ ల్ పిల్లర్ల కింది భాగం వరకూ ఎలా వెళ్లారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం విడ్డూరం. నీటిలో అయితే బోట్ల సాయంతో మాత్రమే పిల్లర్ల వరకు చేరే అవకాశం ఉంటుంది. అలా అసాంఘీక శక్తులు నీటిలో వెల్లినప్పుడు అధికారులు, బ్యారేజీ వద్ద పని చేస్తున్న యంత్రాంగం గుర్తించే అవకాశం లేకుండా పోలేదు. మరో వైపున ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కూడా విధ్వంసకారుల కదలికలు రికార్డు అయ్యేవి ఈ ఆధారాలు కూడా ఇంతవరకు పోలీసులకు ఇరిగేషన్ అధికారులు అయితే ఇవ్వనట్టుగా తెలుస్తోంది. కానీ ఇవేవి పట్టించుకోకుండా హాడావుడిగా ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటో అధికారులకే తెలియాలి. నిపుణుల కమిటీ నివేదికను బట్టి కేసుపై తుది నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు ఎఫ్ఎస్ఎల్ బృందాలు, క్లూస్ టీమ్స్ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ గురించి ఆరా తీస్తామని ఇటీవల భూపాలపల్లి ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర నిపుణుల బృందం మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు నిర్మాణంలో జరిగిన లోపాలేనని తేల్చడంతో మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసును క్లోజ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page