సీపీ రంగనాథ్ ‘బ్రాండ్’ అడ్మినిస్ట్రేషన్…

వరంగల్ కమిషనర్ అంటే హడల్…

బాధితులు శూన్యంలోకి నెట్టివేయ బడ్డ పరిస్థితులు నెలకొన్నాయ్యక్కడ. తమ ఆస్తులకు సెక్యూరిటీ లేదని ఇల్లు, జాగ వదిలి వలస బాట పట్టేలా ధైన్యం దాపురించిందక్కడ. నాలుగో సింహం నిద్దరోపోయిందనాలో… అక్రమార్కులతో చేతులు కలిపిందనాలోనన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులకు ఓ భరోసా వచ్చింది. బాసటనిచ్చే అధికారి బాధ్యతలు చేపట్టడంతో వారి మోముల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ అధికారి విధుల్లో చేరిన కొత్తలో యథా రాజా తథా ప్రజా అన్నట్టుగానే పాలన కొనసాగుతుందని భావించారు గ్రేటర్ ప్రజలు. కానీ ఆయన చట్టానికి పని చెప్పి శాఖాపరంగా చర్యలకు శ్రీకారం చుట్టి గ్రేటర్ లో గ్రేటెస్ట్ ఆఫీసర్ గా మారిపోయారు. అక్రమార్కులపై కొరడా ఝులిపిస్తుండడంతో ఇప్పుడు ఆయనంటేనే హడలిపోతున్నారక్కడ. నెలల వ్యవధిలోనే వరంగల్ మహా నగరంలో పరిస్థితుల్లో మార్పు రావడంతో బాధితులు ధైర్యంగా జీవించే పరిస్థితికి చేరుకోగా… నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలు పెట్టాయి.

వరంగల్ సీపీ రంగనాథ్

సీపీ మార్పుతో…

వరంగల్ నగరంలో భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్ మెంట్లు ఇలా ప్రతి అక్రమ వ్యవహారం ఇలా ఎలాంటి వ్యవహారంలో అయినా తమ ప్రమేయం లేకుండా పనులు జరగకుండా ఉండేవిధంగా సెట్ చేసుకున్నరక్కడ. దీంతో సామాన్యులు అక్రమార్కుల చర్యలతో పట్టపగలే చుక్కలు చూస్తున్నారన్నది నిజం. అధికార పార్టీ నాయకుల పేరుతో సివిలియన్స్, వారి కనుసన్నల్లో తామున్నామన్న ధైర్యంతో కాఖీలు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదట్లో సీరియస్ గా వ్యవహరించినట్టుగా కనిపించకుండా ఉన్న సీపీ రంగనాథ్ చాపకింద నీరులా తన కార్యకలాపాలను కొనసాగించారు. ముందుగా కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. కమిషనరేట్ పరిధిలో 892 మంది భూకబ్జాదారుల వివరాలను సేకరించారని ప్రచారం జరుగుతోంది. భూ కబ్జాలకు పాల్పడ్డవారిని, సెటిల్ మెంట్ గ్యాంగులతో పాటు ఇతరాత్ర తప్పుడు పనులకు పాల్పడే వారి భరతం పట్టే పనిలో పడ్డారు సీపీ రంగనాథ్. కార్పోరేటర్ వేముల శ్రీనివాస్ పై ఓ కేసులో అరెస్ట్ చేయడం సంచలనం కల్గించింది. అధికార పార్టీకి చెందిన నాయకుల విషయంలో కూడా మీనామేషాలు లెక్కించకుండా సీపీ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తుండడం సంచలనంగా మారింది. అవినీతి ఆరోపణలతో నల్లబెల్లి ఎస్సై ఎన్ రాజారాంను సస్పెండ్ చేయడం రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీసింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై వేటు వేసిన సీపీ తనదైన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చేయడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. స్టేషన్ మెట్లెక్కినా లాభం లేదనుకుని తమ ఖర్మ ఇంతేలే అని గ్రేటర్ పరిధిలోని సామాన్యులు జీవనం సాగిస్తున్న బాధితులకు ఏడారిలో ఓయాస్సిస్సులా కనిపిస్తున్నారు వరంగల్ నూతన ఎస్పీ రంగనాథ్. అక్రమార్కుల భరతం పట్టే పనిలో ఆయన వెనక్కి తగ్గకుండా వ్యవహరిస్తుండడంతో అటు పోలీసు విభాగంలో ఇటు పైరవీకారుల్లో దడ దడ మొదలైంది.

సీపీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న అసద్

దివ్యాంగుడి సంబరం…

పోలీస్ కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి నగరంలోని కాశీబుగ్గకు చెందిన దివ్యాంగుడు అసద్ క్షీరాభిషేకం చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి తన ఇంటిని కబ్జా చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని, తనను బెదిరిస్తున్నాడని సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఇంతెజార్ గంజ్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిన్న మొన్నటి వరకు తమ గోడు వినండి సారూ… అంటే సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదన్న కారణాలు చూపించిన గ్రేటర్ పోలీసుల్లో ఈ మార్పు రావడం బాధితుల్లో సరికొత్త సంతోషాన్ని ఇస్తోంది. అసద్ లాంటి వారెందరో కూడా వరంగల్ నగరంలో బాధితులుగా మారిపోయి మానసిక క్షోభకు గురువుతున్నారు. ఈ క్రమంలో ఏవీ రంగనాథ్ ఎంట్రీతో గ్రేటర్ వరంగల్ సినారియోనే మారిపోయిందని చెప్పాలి.

డాటా సేకరణలో…

అయితే సీపీ రంగనాథ్ వరంగల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత పాత దస్త్రాలపై పేరుకపోయిన దుమ్ము ధులిపే పనిలో పడ్డారని తెలుస్తోంది. శాఖాపరంగా వచ్చిన ఫిర్యాదులకు సంబందించిన వివరాలను సేకరించి తప్పుడు పనులకు పాల్పడిన కాఖీ సార్ల డాటా బేస్ అంతా సేకరించినట్టు సమాచారం. దీంతో తమపై వేటు ఎప్పుడు పడుతుందోనన్న ఆందోళన కొంతమంది పోలీసు అధికారుల్లో నెలకొందని వరంగల్ మహానగర్ ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఉచ్చు అక్కడి నుండే…

పోస్టింగుల రికమండేషన్ ఫైళ్లకు కూడా సీపీ రంగనాథ్ చెప్పకనే చెక్ పెట్టిసినట్టయిందన్న చర్చ కూడా సాగుతోంది కమిషనరేట్ పోలీసు వర్గాల్లో. ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్ తో అనుకూలమైన పోస్టింగ్ ఇప్పించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగిన పోలీసు అధికారులకే ఫస్ట్ ఝలక్ ఇచ్చినట్టుగా పోలీసు వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. రికమండేషన్ లెటర్స్ తో బదిలీల ప్రతిపాదనలు చేసిన పోలీసు అధికారులు ట్రాక్ రికార్డ్ తెప్పించుకున్న సీపీ వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కమిషనరేట్ లో పరిస్థితులన్ని ఒక్కసారిగా ఉల్టాపల్టాగా మారిపోయాయని అనిపిస్తోంది. నిన్నటి వరకు పొలిటికల్ పవర్ ఉంటేనే బెటర్ పోలీసు పవర్ లేకున్న చెలాయించొచ్చు అనుకున్న పోలీసు అధికారులంతా కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. వరంగల్ సీపీగా రంగనాథ్ రాకతో న్యాయానికి అనుకూలంగా చట్టం పనిచేస్తోందన్న ధీమాను కల్పించారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page