డ్యూటీలో ఉన్నప్పుడు సామాన్యడు అయినా బాస్ అయినా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా వ్యవహరించిన వారిపై ఒత్తిళ్లు రావడం సాధారణంగా వింటూంటాం చూస్తుంటాం. అందులో తమపై అధికారిని ఎదురించే పరిస్థితి ఏ శాఖలోనూ ఉండదు. పోలీసు విభాగంలో అయితే క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు తమపై అధికారులు భావిస్తారన్న భయం కూడా ఉంటుంది. దీంతో తమ బాస్ కాబట్టి చాలా మంది వారేం చేసినా కిమ్మనకుండా ఉంటుంటారు కింది స్థాయి సిబ్బంది. కానీ అక్కడ మాత్రం ఓ సీపీకి నిభందనలు గుర్తు చేశారో కానిస్టేబుల్. తాను కూడా రూల్స్ కు విరుద్దంగా వెల్లకూడదు కదా అని అనుకున్నారా బాస్ ఆమె చెప్పినట్టే నడుచుకున్నారు కూడా.
రాచకొండ కమిషనరేట్ లో
టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ వ్యవహారం రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా ఎగ్జామినేషన్ సెంటర్లను విజిట్ చేస్తున్నారు. దశాబ్దకాలం తరువాత ఉన్నతాధికారులు పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం ఆరంభించారని చెప్పవచ్చు. గురువారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీ నగర్ పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కమిషనర్ డిఎస్ చౌహాన్ తనిఖీ చేసేందుకు వెళ్లారు. సీపీ వెంట ఏసీపీతో పాటు పలువురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సీపీ నేరుగా పరీక్షా కేంద్రంలోకి వెల్తున్న క్రమంలో మెయిన్ గేటు వద్ద డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ కల్పన సార్ మీ మొబైల్ ప్లీజ్ అని అడిగారు. నిభందనల ప్రకారం పరీక్షా కేంద్రంలోనికి ఎవరూ కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్ల కూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న కానిస్టేబుల్ కల్పన సీపీ డీఎస్ చౌహన్ మొబైల్ వెంట తీసుకుని సెంటర్ లోకి వెల్తుంటే అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సీపీ కూడా తన సబార్డినేట్ తనను శాసిస్తున్నారని ఫీల్ కాకుండా తనచేతిలోని మొబైల్ ఫోన్ గేటు వద్ద కానిస్టేబుల్ కు ఇచ్చేసి పరీక్షా కేంద్రంలోకి వెల్లారు. బయటకు వచ్చిన తరువాత తన ఫోన్ తీసుకున్న సీపీ ఉమెన్ పీసీ కల్పనను అభినందించి నజరానాగా రూ. 500 ఇచ్చారు. ఉన్నత స్థాయి అధికారి హోదాలో ఉన్న డీఎస్ చౌహన్ కు రూల్స్ గుర్తు చేసి అతిక్రమించకుండా వ్యవహరించిన కానిస్టేబుల్ కల్పన తీరుపై ప్రశంసలు కురుస్తుంటే… సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్ కూడా బాసిజం చూపించకుండా నిభందనలకు అనుకూలంగా నడుచుకోవడమే కాకుండా ఆమెను అభినందించిన తీరుపై ప్రతి ఒక్కరూ ఆయన్నూ అభినందిస్తున్నారు.