బీసీలకు లక్ష సాయం ఎఫెక్ట్…

సర్టిఫికెట్ల కోసం పడిగాపులు

దిశ దశ, జగిత్యాల:

బలహీన వర్గాల్లోని కొన్ని సామాజిక వర్గాలకు రూ. లక్ష సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెవెన్యూ కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలు, ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు కూడా సర్టిఫికెట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ. లక్ష సాయం పొందితే తమ కుటుంబాల అవసరాలకు అక్కరకు వస్తాయని ఆశిస్తున్నా చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు ఉత్సుకత చూపుతున్నారు. దీంతో ఇంతకాలం తమకు అవసరం లేదన్న భావనతో ఉన్న వారు కూడా ఇప్పుడు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి వేళల్లో కూడా తహసీల్దార్ కార్యాలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ లక్ష సాయం అందిస్తామని ప్రకటించడంతో మంత్రి గంగుల కమలాకర్ ఆన్ లైన్ దరఖాస్తుల కోసం వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష సాయాన్ని మంచిర్యాల సభలో ప్రారంభించారు. దీంతో తమకు కూడా సర్కారు ఆదుకుంటుందన్న ఆశతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయానికి అర్హత కావాలంటే ఆదాయం, కులం సర్టిఫికెట్లు ముఖ్యం కావడంతో సామాన్యులు అటు మీ సేవా కేంద్రాల చుట్టు, ఇటు రెవెన్యూ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారు.

వేలల్లో దరఖాస్తులు…

బీసీలకు ఆర్థిక సాయం కింద లాభోక్తులు కావాలని ఆశిస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ అడిగిన సర్టిఫికెట్లు ముందుగా తీసుకోవల్సిన అవసరం ఉన్నందున వాటి కోసం జనాలు ఆఫీసుల వద్ద బారులు తీరుతున్నారు. మెట్ పల్లి రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికెట్లు జారీ చేయడానికి సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ దరఖాస్తు దారులు మాత్రం సర్టిఫికెట్లు కోసం ఆఫీసు వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఒక దశలో సర్వర్ పనిచేయకపోవడంతో రెవెన్యూ సిబ్బంది సర్టిఫికెట్లు అందించడానికి తంటాలు పడుతున్నారు. ఏది ఏమైనా సర్కారు ఇస్తామని ప్రకటించిన లక్ష సాయం మాత్రం జనాల్లో కొత్త క్రేజీని తెచ్చిపెట్టింది.

You cannot copy content of this page