ఒడిశా సీఎం నిర్ణయం…
దిశ దశ, జాతీయం
అవయవ దాతలు ముందుకు రావాలన్న సంకల్పంతో ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే అవయవ దాత పేరిట అవార్డలు కూడా ఇస్తున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. దేశంలో తమిళనాడు తరువాత ఆ క్రెడిట్ దక్కించుకున్న రాష్ట్రంగా ఒడిశా నిలవనుంది. అకస్మాత్తుగా మరణిస్తున్న వారి అవయవాలను అందించినట్టయితే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రాణం పోసే అవకాశం ఉంటుంది. అయితే మరణించిన తమవారి అవయవాలను దానం చేసే విషయంలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. గత సంవత్సరం తమిళనాడు ప్రభుత్వం అవయవదానాలు ఇచ్చే వారి అఖరి మజిలిని అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా కూడా ఆదర్శప్రాయంగా నిలిచింది. తాజాగా ఇదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుకు సాగాలని నిర్ణయించింది. అయితే అవయవాలను దానం చేసే కుంటుంబాలకు సూరజ్ పేరిట అవార్డులను కూడా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఇస్తోంది. 2019లో రాష్ట్రంలోని గంజాం జిల్లాకు చెందిన సూరజ్ అనే బాలుడు రోడ్ యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆ కుటుంబాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్వయంగా కలిసి రూ. 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా అప్పటి నుండే రాష్ట్రంలో అవయవదానం చేసే వారికి సూరజ్ పేరిట ఏడాదికోసారి అవార్డలు ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. అలాగే అవయవ దాతల కుటుంబాలకు సీఏం రిలీఫ్ ఫండ్ నుండి రూ. 5 లక్షల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు.