రెండు జిల్లాల్లో సంచలనంగా మారిన మర్డర్
దిశ దశ, మంచిర్యాల:
హన్మకొండ జిల్లాలో జరిగిన నేరానికి సంబంధించిన దర్యాప్తు మంచిర్యాల జిల్లాలో కూడా చేపట్టక తప్పని పరిస్థితి తయారైంది. గురువారం జరిగిన నేరం రెండు జిల్లాలతో ముడి పడి ఉండడంతో ఓ చోట మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ మరో చోట వెపన్ మిస్సింగ్ కేసుపై విచారణ చేస్తున్నారు పోలీసు అధికారులు. హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో కానిస్టేబుల్ ప్రసాద్ అత్త కమలను తుపాకితో కాల్పి చంపిన ఘటన సంచలనం కల్గించింది. అయితే ప్రసాద్ మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసు అధికారులు రెండు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మర్డర్ కేసు గురించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, రామగుండం కమిషనరేట్ పోలీసులు వెపన్ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ కొద్దిసేపటి క్రితం కోటపల్లి పోలీస్ స్టేషన్ కు వెల్లి విచారణ చేపట్టారు. నిందితుడు ప్రసాద్ వినియోగించింది సర్వీస్ వెపన్ కావడంతో పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆయధం అతని చేతికి ఎలా వెల్లింది అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రసాద్ కు షార్ట్ వెపన్ తీసుకెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టే పనిలో పోలీసు అధికారులు నిమగ్నం అయ్యారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్ర స్థాయిలో పర్యటన చేపట్టిన డీసీపీ సుధీర్ ఠాణాలో పనిచేస్తున్న పలువురి వాంగ్మూలం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
వారెంట్ కోసం..?
అయితే కానిస్టేబుల్ ప్రసాద్ బుధవారం సాయంత్రం వారెంట్ కావాలని ఓ పోలీసు అధికారిని అడగడంతో బెల్ ఆఫ్ ఆర్మ్స్ గదిలో ఉన్న వారెంట్ బుక్ తీసుకరావాలని ఆ అధికారి అతనికే చెప్పినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ బెల్ ఆఫ్ ఆర్మ్స్ గది నుండి వారెంట్ బుక్ తీసుకునేందుకు వెల్లి అక్కడే ఉన్న ఓ షార్ట్ వెపన్ ను కూడా వెంట తీసుకుని వచ్చి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రసాద్ వెపన్స్ ఉంచిన గదిలోకి వెల్లిన కొద్దిసేపటి ముందే ఆర్మ్స్ క్లీనింగ్ టీమ్ వెల్లి శుభ్రం చేసిందని కూడా విచారణలో తేలినట్టుగా సమాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరికి ఈ మేరకు మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ నివేదిక అందించనున్నట్టుగా తెలుస్తోంది.