చట్టానికి చిక్కుకుండా… బినామీలతో దందాలా..? కరీంనగర్ కమిషనరేట్ లో సరికొత్త కోణం…

దిశ దశ, కరీంనగర్:

కరీంగనర్ లో భూదందాలు, ప్రైవేట్ సెటిల్ మెంట్ల గ్యాంగులకు వెన్నుదన్నుగా నిలిచిన కొంతమంది చట్టానికి చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారా..? భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదని అనామకుల పేరిట లావాదేవీలు జరిపి సేఫ్ జోన్ లో ఉన్నారా..? అంటే అవుననే వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలను పరిశీలిస్తే…

బినామీలుగా…

కరీంగనర్ పరిసర ప్రాంతాల్లో భూ దందాలకు పాల్పడిన వారు తమ పేరిట లావాదేవీలు జరిపినట్టయితే ఇబ్బందులు తప్పవని గ్రహించే సెటిల్ మెంట్ల గ్యాంగుల పేరిట వ్యవహారాలు చక్కదిద్దినట్టుగా ప్రచారం జరుగుతోంది. కొంతమందిని తమ పంచన చేర్చుకుని వారి పేరిట లావాదేవీలు జరిపిన కొంతమంది నాయకులు లీగల్ గా పోలీసులకు చిక్కే అవకాశం లేకుండా తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. భూ అక్రమణల ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా సదరు నాయకులు, ప్రముఖుల పేర్లు వినిపించినప్పటికీ అధికారికంగా జరిపిన లావాదేవీల్లో మాత్రం ఇతరుల పేర్లతో నడిపించినట్టుగా తెలుస్తోంది. రేకుర్తి, మల్కాపూర్, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ తదితర ప్రాంతాల్లో ల్యాండ్ మాఫియాలను పెంచి పోషించిన కొంతమంది ప్రముఖులు వారి పేరిటే దందాలు నెరిపినట్టుగా ప్రచారం సాగుతోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టయితే తమ పేరు బయటకు రాకుండా ఉంటుదని గుర్తించే ముందుగానే ఇలాంటి చర్యలతో కాలం వెల్లదీసినట్టుగా తెలుస్తోంది. ఒక వేళ్ల చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టినట్టయితే తాము సేఫ్ జో్న్ లో ఉంటామని, లావాదేవీలు జరిగినట్టుగా రికార్డుల్లో ఉన్న వారిపై కేసులు నమోదవుతాయని భావించే ముందు చూపుతో ఇలా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులకు చేరుతున్న కొన్ని ఫిర్యాదుల్లో ప్రముఖుల పేర్లపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోతుందని కూడా సమాచారం.

దందాలపై లోతుగా దర్యాప్తు చేస్తే…

కరీంనగరంతో పాటు శివారు ప్రాంతాల్లో జరిగిన దందాలపై లోతుగా దర్యాప్తు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. భూదందాలకు సంబంధంచిన వ్యవహారాలకు పాల్పడిన వారిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుని ఇలాగే నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసులు నమోదు చేసినట్టయితే ఖచ్చితంగా చట్టానికి చిక్కుకుండా ఉన్న వారి పేర్లు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. బినామీలుగా చెలామణి అయిన వారి ఆర్థిక స్థితిగతులు ఏంటీ..? లక్షలాది రూపాయాలు పెట్టి ఆస్థులు కొనుగోలు చేసే పరిస్థితి వారికి కానీ వారి కుటుంబాలకు కానీ ఉందా లేదా..? ఒకవేళ ఉన్నట్టయితే ఐటీ చెల్లిస్తున్నారా ఇన్ కం ట్యాక్స్ చెల్లించకుండా అంతపెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారంటే బ్లాక్ మనీ దందాకు తెరలేపినట్టే అవుందని నల్ల చట్టాలకు కూడా పని చెప్పినట్టయితే బినామీలు అసలు విషయాలను పోలీసుల ముందు ఉంచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది బినామీల ద్వారా ద్వారా దందాలకు పాల్పడుతున్న వారు ఫేక్ సంస్థల పేరిట ఐటీలు చెల్లిస్తూ లేని కంపెనీలను క్రియేట్ చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అటు భూ దందాలతో పాటు ఐటీ అధికారులను కూడా రంగంలోకి దింపినట్టయితే వీరి గుట్టు మొత్తం రట్టయ్యే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భూ దందాలకు పాల్పడుతున్న వారు లగ్జరీ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు…? నామ మాత్రపు ఆదాయంతో కార్లు, బైకులు, ఆస్తులు ఎలా కూడబెట్టుకోగలుగుతారన్న విషయంపై ఏసీబీ అధికారులను రంగంలోకి దింపినట్టయితే బినామీ యాక్ట్ లపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది.

శాశ్వత పరిష్కారం చేయాల్సిందే…

కరీంనగర్ లో వేళ్లూనుకున్న భూ దందాలకు శాశ్వతమైన బ్రేకులు పడాలంటే పోలీసు అధికారులు కూడా కేవలం ఐపీసీ, సీఆర్పీసీలకే పరిమితం కాకుండా ఐటీ, బినామీ యాక్టుల అమలుకు ఆయా శాఖల సమన్వయంతో దర్యాప్తు చేసినట్టయితే దర్జాతనం వెలగబెడుతున్న ప్రబుద్దులపై పకడ్భందీగా చట్టాలను ఉపయోగించే అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. బాధితులు కూడా కేవలం పోలీసు విభాగాలనే ఆశ్రయించకుండా తమ భూముల్లో చొరబాటుకు గురైన వారిపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టయితే ఆదాయానికి మించిన ఆస్థుల కేసులు కూడా నమోదు చేసి రంగంలోకి దిగే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page