దిశ దశ, కరీంనగర్:
కాంట్రాక్టర్లు సిండికేట్ అయి సకాలంలో పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ లో ‘‘దిశ’’ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సిండికేట్ అయిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించానన్నారు. కేంద్రం నిధులను గతంలో దారి మళ్లించారని, ప్రధానమంత్రి అవాస్ యోజన నిధులతో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రజలకు చేరువయ్యేలా చూడాలని, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను రెండు కండ్లలా భావించాలని అధికారులకు హితవు పలికారు. కరీంనగర్ అభ్యున్నతి కోసం అత్యధికంగా నిధులు తీసుకొస్తున్నామని వెల్లడించిన బండి సంజయ్ టీహబ్ కోసం వెచ్చిస్తున్న నిధులన్ని కేంద్ర ప్రభుత్వానివే అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడి ఫోటో మాత్రం ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మద్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్న తీరుపై కూడా కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పొగ బారిన పడకుండా ఉండేందుకు కేంద్రం ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తుటే పాఠశాలల్లో మాత్రం వంట చెరుకుతో భోజనాలు తయారు చేస్తుండడం ఏంటన్నారు. కరీంనగర్ లోకసభ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్లపై మద్యాహ్న భోజనం ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. పొగబారిన పడి విద్యార్థులు కూడా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉన్నందున సత్వరమే గ్యాస్ స్టౌలపై మద్యాహ్న భోజనం ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు రవాణా ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కెటాయిస్తోందని ఆ నిధులను సద్వినియోగం చేస్తున్నారా లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో 13, సిరిసిల్లలో 11 స్కూల్స్ ఎంపిక చేసి రూ.52 లక్షలు విడుదల చేశామని, ఆ నిధులను ఎందు కోసం ఖర్చు చేస్తున్నారని అడిగారు. పీఎం శ్రీ పథకం కింద ఏడాదికి 40 లక్షల రూపాయిల చొప్పున నిధులు ఐదేళ్ల పాటు అందుతాయని, ఈ నిధులను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వెచ్చించాలన్నారు.ఈ నిధులు మళ్లించకుండా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు.
భారత్ బ్రాండ్ వెహికిల్స్
భారత్ బ్రాండ్ స్కీమ్ ప్రోడక్ట్ వాహనాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, నాఫెడ్ ఆధ్వర్యం లో భారత్ బ్రాండ్ స్కీమ్ పేరిట ప్రవేశపెట్టిన నిత్యవసర వస్తువుల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నాఫెడ్ స్టేట్ డిప్యూటీ మేనేజర్ పట్నాయక్, ఆర్డీఓ మహేశ్వర్. నైవేధ్యం ఫుడ్స్ నిర్వాహకులు బోనగిరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ ప్రోడక్ట్ స్కీమ్ లో రూ. 30కే కిలో గోధుమపిండి, రూ. 70కే కిలో శనగ పప్పు, రూ. 34 రైస్ ను విక్రయించనున్నారు. నిత్యవసరాలను ఇంటి వద్దకే చేరవేయనున్నారు.