బాధితుని ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ
దిశ దశ, మంథని:
అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల తలొగ్గి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు చేస్తుంటారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. చట్టాలను తమకు అనుకూలంగా మల్చుకుని ముప్పు తిప్పులు పెడుతున్నారని విమర్శిస్తుంటారు. కానీ అక్కడ మాత్రం ఏకంగా అధికార పార్టీ నాయకునిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అది రాష్ట్ర మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చోటు చేసుకోవడం గమనార్హం.
బాధితుని ఫిర్యాదుతో…
మంథని పట్టణ మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ (సత్యనారాయణ)పై క్రిమినల్ కేసు నమోదు చేశారు మంథని టౌన్ పోలీసులు. పట్టణంలోని మందల మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎప్ఐఆర్ నంబర్ 185/2024లో సెక్షన్ 126(2), 329 (4), 308 (5), 351 (3), r/w 3(5) BNS యాక్టులో కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితుడు మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో మంథని పట్టణంలో తనకు చెందిన 302 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్నానని, ఇందుకు మంథని మునిసిపల్ విభాగం నుండి అనుమతులు ఉన్నాయని వివరించారు. అయితే ఈ ఇంటి నిర్మాణం విషయంలో మాజీ ఉప సర్పంచ్ సతీష్ రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేనట్టయితే నిర్మాణాన్ని అడ్డుకుంటానని బెదిరించాడని బాధితుడు పేర్కొన్నారు. భవన నిర్మాణంపై మునిసిపల్ అధికారులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడని, దీంతో తాము హై కోర్టును ఆశ్రయించామని మల్లారెడ్డి తెలిపారు. ఆ తరువాత సతీష్ తన గన్ మెన్ తో వచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఇంటిని కూల్చే వరకు వదిలి పెట్టేది లేదని, గతంలో చాలా మందికి ఇలాగే ఫిర్యాదు చేసి ఇండ్లను కూల్చివేయించానని నీకు కూడా అదే విధంగా జరుగుతుందని హెచ్చరించాడని తెలిపారు. అంతేకాకుండా మునిసిపల్ కమిషనర్ మల్లిఖార్జున స్వామిపై ఒత్తిడి చేసి తన ఇంటి నిర్మాణం జరగకుండా అడ్డుకున్నాడని, సతీష్ బెదిరింపులు తట్టుకోలేక ఆగస్టు 20న రూ. 2 లక్షలు ఇవ్వగా మిగతా రూ. 3 లక్షలు ఇవ్వాలని బెదిరించాడని బాధితుడు మల్లారెడ్డి ఈ ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మంథని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంథని కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఇనుమల సతీష్ (సత్యనారాయణ) ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న మంథనికి చెందిన కాంగ్రెస్ నాయకునిపై కేసు నమోదు కావడం స్థానికంగా సంచలనంగా మారింది. బాధితుడు మల్లారెడ్డి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసేందుకు వెనక్కి తగ్గకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మంథనిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలను కొట్టి పారేసే విధంగా మంథని పోలీసులు ఇనుముల సతీష్ పై ఎఫ్ఐఆర్ జారీ చేయడం విశేషం.