సంచలనంగా మారిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఫిర్యాదు
దిశ దశ, వరంగల్:
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లెక్కల పంచాయితీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకాలం ఆరోపణలు, కౌంటర్ల మధ్య సాగిన ప్రెస్ క్లబ్ లావాదేవీల తీరు తాజాగా క్రిమినల్ కేస్ నమోదు చేసే వరకూ చేరడం సంచలనంగా మారింది. గతంలో రంగనాథ్ సీపీగా ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేశామని ఈ వ్యవహరంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అధ్యక్షుడు నాగరాజు వేముల, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 6న హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన ఉన్న శ్రీధర్ రెడ్డి తుమ్మ, వెంకటేశ్వర్లు పెరుమాండ్లుపై క్రైం నంబర్ 206/2024, సెక్షన్ 420, 406 r/w 34 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు. 2018-22 మధ్య కాలంలో వీరిద్దరితో పాటు 12 మంది ఆఫీసు బేరర్లుగా బాధ్యతలు నిర్వర్తించారని, ఈ కమిటీ జరిపిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగిన విషయంపై 2023 ఫిబ్రవరి 17న జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో చర్చించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు హయంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నూతనంగా ఏర్పడిన కమిటీ బాధ్యులు మూడు సార్లు లేఖలు రాసినప్పుడు అరాకొరా సమాచారం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారని వివరించారు. వాస్తవాలతో కూడిన లేఖను తాము విడుదల చేసిన క్రమంలో జర్నలిస్ట్ యూనియన్ల నాయకులు మధ్యవర్తిత్వం వహిస్తూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని చెప్పడంతో తాము అంగీకరించామన్నారు. అయితే యూనియన్ల నాయకుల సమక్షంలో రెండు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వీరిద్దరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విరించారు. తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లులు నాలుగేండ్లలో రూ. 1.39 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిర్వహించారన్నారు. అయితే ప్రెస్ క్లబ్ బైలా ప్రకారం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన లెక్కలను ఏడాదికి ఒకసారి ఆడిట్ చేయించాల్సి ఉన్నప్పటికీ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఆడిట్ చేయించలేదన్నారు. తమ కమిటీ బాధ్యతలు తీసుకున్న తరువాత బ్యాంకు లావాదేవీలను పరిశీలించినప్పుడు ప్రెస్ క్లబ్ కు సంబంధం లేని విషయాల్లో రూ. 40 లక్షలు వెచ్చించినట్టుగా గుర్తించామని ఇందుకు బాధ్యులైన తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదు మేరకు పూర్వ అధ్యక్ష్య, కార్యదర్శులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు హన్మకొండ పోలీసులు.