సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు…
దిశ దశ, హన్మకొండ:
హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఓ గ్రానైట్ క్వారీ యజమానిని డబ్బుల కోసం వేధింపులకు గురి చేశాడన్న పిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ అయింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో క్రైం నంబర్ 252/2025, సెక్షన్ 308(2), 308(4), 352 BNS యాక్టుల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న కె ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమాదేవి భర్త మనోజ్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. గత 20 రోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న మనోజ్ రెడ్డిని గమనించి వివరాలు అడగగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గతంలో రూ. 25 లక్షలు తీసుకున్నాడని, మళ్లీ రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని తెలిపారన్నారు. ఈ నెల 18వ తేది మద్యాహ్నం 1 గంటల సమయంలో 9949219999 నంబర్ నుండి మనోజ్ రెడ్డి మొబైల్ నంబర్ 9959513366 నంబర్ కు కాల్ చేసి దుర్భాషలాడుతూ… రూ. 50 లక్షలు ఇవ్వాలని లేనట్టయితే మనోజ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరింపులకు గురి చేశాడని పేర్కొన్నారు. దీంతో మనోజ్ రెడ్డి తీవ్ర మానసిక వేధనకు గురయ్యాడని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సుబేదారి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.