దసరా లక్కి డ్రా గాళ్లకు ‘‘బంపర్ బొనాంజా’’ అందించిన పోలీసులు…

దిశ దశ, వేములవాడ:

అమవాస్య రోజున పట్టపగలే చీకటి కమ్ముకునేలా చేశారు వేములవాడ పోలీసులు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చట్టాలకు పని చెప్పి తీరుతామని తేల్చి చెప్పారు. పండగ పూట జనాలకు బంపర్ ఆఫర్లు పేరిట ఆశ చూపి లక్షలు గడించాలని భావించిన లక్కిడ్రా నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సంచలనం సృష్టించారు. దసరాకు పది రోజుల ముందే లక్కి డ్రా తీసేవారికి గ‘మ్మత్తు’గా మత్తు వదిలించారు. ఇటీవల కాలంలో తెలంగాణాలో విజయ దశమి వస్తుందంటే చాలు లక్కీ డ్రాల పేరిట నిలువు దోపిడీలకు పాల్పడే వారు రెచ్చిపోతున్నారు. నామ మాత్రంగా డబ్బులు చెల్లించండి, లక్కి డ్రాలో చేరినట్టయితే బహుమతులు ఇస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.

పోతే వంద… వస్తే వేలు…

‘‘వంద కొట్టు… మేకను పట్టు’’ అన్న స్లోగన్ తో లక్కిడ్రాకు శ్రీకారం చుట్టారు కొంతమంది. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ ప్రచారం చేశారు నిర్వాహాకులు. మొదటి బహుమతి మేకపోతు, రెండో బహుమతి 24 బీర్లు, మూడో బహుమతి 100 పైపర్ ఫుల్ బాటిల్, ఐదో ప్రైజ్ 25 కిలోల రైస్ బ్యాగ్, ఆరో బహుమతి పట్టు చీరె, ఏడో బహుమతి 10 గ్రాముల సిల్వర్ కాయిన్ 8వది 5 కిలోల చికెన్, 9వది రెండు నాటుకోళ్లు, పదో బహుమతి సిగ్నేచర్ ఫుల్ బాటిల్, 11వది రూ. 516 నగదు ఇస్తామంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కొందరు ఈ బంపర్ ఆఫర్లకు సంబంధించిన బ్రోచర్లను వైరల్ చేశారు. ఈ నెల 10వ తేదిన దీనికి సంబంధించిన లక్కీడ్రా తీస్తామని కూడా ప్రకటించారు. అయితే రూ. 100 చెల్లిస్తే అదృష్టం బావుంటే వేలల్లో లాభం వస్తుందన్న ఆశతో అమాయకులు లక్కీడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. అయితే నిర్వాహకులు మాత్రం లక్షల్లో లాభం గడిస్తారన్న విషయాన్ని పట్టించుకోకుండా స్థానికులు ఈ స్కీంలో చేరేందుకు ఆసక్తి చూపారు. నిర్వహాకులకు కాసుల పంట పండిస్తుందని ఆశించినప్పటికీ పోలీసులు చట్టాలకు పని చెప్పడంతో నిర్వాహకుల తలరాత మారిపోయినట్టైంది. లక్కీడ్రాలో చేరిన వారికి ఇచ్చిన రశీదులను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తమ బంపర్ ఆఫర్ గురించి మరింత గొప్పగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు నిర్వహాకులు. ఈ విషయం కాస్తా ఆ నోట ఈ నోట పోలీసుల చెవిన పడడంతో చట్ట వ్యతిరేకంగా లక్కీడ్రాలు నిర్వహిస్తున్నారంటూ కొరడా ఝులిపించడం మొదలు పెట్టారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఈ విషయంపై సమగ్రంగా ఆరా తీసి నిందితులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో శ్రీకాంత్, ప్రశాంత్, మహేందర్, వెంకటేష్, స్వామిలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇటువంటి వారిని నమ్మి మోసపోవద్దని వేములవాడ ప్రజలకు ఏఎస్పీ సూచించారు. దశాబ్దాల క్రితం లక్కీడ్రాలు, స్కీముల నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తిరిగి దసరా ఆఫర్ల పేరిట మళ్లీ తెరపైకి వచ్చిన క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో ఆదిలోనే ఈ వ్యవహారానికి చెక్ పడినట్టయింది.

You cannot copy content of this page