పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
దిశ దశ, హైదరాబాద్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెల్లిన ఆయనపైనే ఎదురు కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం… బుధవారం మద్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ సీఐ బయటకు వెల్తుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాహనం వద్దకు చేరుకున్నారు. సీఐ వాహనానికి మరో కారును అడ్డంగా పెట్టడంతో ఆయన ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. తాను అత్యవసరమైన డ్యూటీ మీద బయటకు వెల్తున్నానని, ఫిర్యాదును పోలీస్ స్టేషన్ లో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ కు ఇవ్వాలని సీఐ సూచించారు. లేనట్టయితే తాను తిరిగి వచ్చే వరకూ వేచి ఉండాలని కూడా కౌశిక్ రెడ్డిని కోరారు. అయితే సీఐ మాటలు పట్టించుకోకుండా ఎమ్మెల్యేతో పాటు అతనితో పాటు వచ్చిన వారంతా కూడా సీఐని బెదిరించడం మొదలు పెట్టారు. చివరకు స్టేషన్ లోకి వెల్లినప్పటికీ సీఐపై దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అతని అనుచరులపై సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు అయింది. క్రైం నంబర్ 1127/2024లో ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కల్గించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన సెక్షన్లలో కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లో సమర్పించి రిసెప్షన్ లో రశీదు తీసుకునే సాంప్రాదాయం ఉన్నప్పటికీ శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన అధికారిని అడ్డుకోవడం సరికాదని పోలీసులు అంటున్నారు.