భాగ్యనగరంలో ఫ్లెక్సీల కలకలం…

కాషాయానికి ముందు…. తర్వాత

బీజేపీ టార్గెట్ గా వెలిసిన వైనం

దిశ దశ, హైదరాబాద్:

మరి కొద్ది సేపట్లో ఈడీ విచారణ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అనుకూలంగా రాష్ట్ర రాజధానిలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీని విమర్శిస్తూ కవితను గొప్పతనాన్ని కీర్తిస్తూ వెలిసిన ఈ బ్యానర్లు హాట్ టాపిక్ గా మారాయి. ఈడీ, సీబీఐల ద్వారా బీజేపీ బెదిరింపులకు పాల్పడుతోందంటూ ఫ్లెక్సీల్లో విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరక ముందు తర్వాత అంటూ కాషాయం కండువా కప్పుకున్న నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు జరగగానే కాషాయ రంగు పూసుకుని బీజేపీలో చేరారంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన నేతల ఫోటలను ఫ్లెక్సీల్లో ముద్రించారు. ఇందులో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హెమంతో్ బిశ్వా, పశ్చిమ బెంగాల్ నేత సువేంధు అధికారి, ఏపీకి చెందిన సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రావు ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఎమ్మెల్సీ కవిత మాత్రం ఎలంటి మరక అంటకుండా ఉన్నారని, అసలైన రంగులు వెలిసిపోవన్న కోటేషన్లు రాసి మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బైబై మోడీ అంటూ ఏర్పాటు చేసిన హ్యాష్ ట్యాగ్ కూడా చేర్చిన ఈ ఫ్లెక్సీలు హైదరాబద్ నగరంలోని పలు చోట్ల కనిపించాయి. ఈడీ విచారణ తరువాత కూడా తాను బీఆర్ఎస్ లోనే కొనాసాగుతానని, కాషాయం కండువా కప్పుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చిన తలొగ్గే ప్రసక్తే లేదని కవిత గతంలో పలుమార్లు చెప్పారు. ఫ్లెక్సీల్లో కూడా ఇదే అర్థం వచ్చే విధంగా ఉండడం చర్చనీయాంశం అయింది. బీజేపీని బలోపేతం చేసుకునేందుకు ఏకంగా ముఖ్యమంత్రి తనయనే పార్టీ మారాలని ఒత్తిడికి గురి చేసిందన్న విషయం ప్రజలకు వివరించాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. ఏది ఏమైనా కవిత విచారణ ఎదుర్కొంటున్న శనివారం నాడే ఫ్లెక్సీలు వెలియడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.


You cannot copy content of this page