అక్కడో రీతి… ఇక్కడో నీతి… అధికారుల తీరుపై విమర్శలు…

దిశ దశ, మానకొండూరు:

ఒకే జిల్లాలో విచిత్ర పరిస్ధితులు నెలకొన్నాయి. పట్టుమని పాతిక కిలోమీటర్ల దూరం కూడా లేకున్నా రెండు చోట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విస్మయానికి గురి చేస్తోంది. తామేం చేసినా చెల్లుతుందన్న ధీమానో… లేక సర్కారు ఆస్తులు ఏమైతే మాకేంటన్న నిర్లక్ష్యమో తెలియదు కానీ అక్కడ మాత్రం అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది.

తిమ్మాపూర్ లో అలా…

కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గతంలో వేసిన ఓ వెంచర్ ద్వారా ప్లాట్ల విక్రయాలు జరిగాయి. అయితే ఈ విషయంపై సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి 2022 ఏప్రిలో లో స్థానిక తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఎస్సారెస్పీకి చెందిన భూమి కబ్జాకు గురవుతోందని పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మంగళవారం సర్వే చేశారు. రియాల్టర్ ఏకంగా ఎస్సారెస్పీకి చెందిన ఎకరం స్థలాన్ని కబ్జా చేసినట్టు సర్వేల చేసి గుర్తించిన అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సంబంధిత వెంచర్ నిర్వాహకులకు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి నోటీసులు జారీ చేశారు. దాదాపు 22 నెలలకు అధికారులు ఈ ఆక్రమణ వ్యవహారంపై సీరియస్ గా వ్యవహరించడం గమనార్హం. అయితే ఈ విషయంలో అధికారులు నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటారా లేక క్రిమినల్ చర్యలు తీసుకుంటారా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది.

తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని అక్రమ వెంచర్ వద్ద కందకం తవ్విన అధికారులు

నగునూరులో ఇలా…

కరీంనగర్ సమీపంలోని నగునూరు దుర్గా భవాని మాత ఆలయం సమీపంలో వేసిన వెంచర్ విషయంలో్ మాత్రం అధికారులు విభిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ అక్షర టౌన్ షిప్ పేరిట ఏర్పాటు చేసిన వెంచర్ కు మెయిన్ రోడ్డుగా ఎస్సారెస్పీ కెనాల్ దారిని చూపించారు. నిభందనల ప్రకారం కెనాల్ దారిని వెంచర్ దారిగా చూపించడానికి వీలు లేదు. అంతేకాకుండా కెనాల్ కు అనుభందంగా ఉన్న చానెల్స్ ను కూడా ద్వంసం చేసినట్టుగా అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి వాటిని బాగు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే లేఔట్ కోసం ఇచ్చిన పర్మిషన్ పై కూడా ‘శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ’కి లేఖ రాయగా రెండేళ్ల నుండి రెండు సార్లు సుడా అక్షర టౌన్ షిప్ వెంచర్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులతో సరిపెట్టింది. అధికారులు పట్టించుకోని వైఖరితో వెంచర్ నిర్వాహకులు తాజాగా వెంచర్ చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మిస్తుండడంతో పాటు భారీ సైజులో స్వాగత తోరణాన్ని నిర్మిస్తున్నారు. అయితే కెనాల్ వైపే మెయిన్ ఎంట్రన్స్ కమాన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఛానెల్స్ కూడా ఈ వెంచర్ మీదుగా ఉన్నాయి. దీంతో ఎస్సారెస్పీ ఛానెల్స్ ద్వారా దిగువ ఉన్న భూములకు నీరందుతుందా లేదా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మరో వైపున వెంచర్ కు లౌ ఔట్ పర్మిషన్ తీసుకోగా సుడా షోకాజ్ నోటీసులు ఇచ్చిన తరువాత నిర్వాహకులు ఎలాంటి పర్మిషన్ లేకుండా స్వాగత తోరణం, కంపౌండ్ వాల్ నిర్మించడం వెనక ఆంతర్యం ఏంటన్నదే పజిల్ గా మారింది. గేటెడ్ కమ్యూనిటీ కోసం కూడా అనుమతులు తీసుకోకుండా ఇలా కంపౌండ్ వాల్ నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగునూరు వెంచర్ చుట్టూ నిర్మిస్తున్న కంపౌండ్ వాల్

ఇంకా ఎన్నో…

కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి, రేకుర్తి, మల్కాపూర్, పద్మానగర్, సిరిసిల్ల బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లోనూ ఎస్సారెస్పీకి చెందిన భూములు ఉన్నాయి. అయితే కొన్ని స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులు వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించినా ఎస్సారెస్పీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎస్సారెస్పీ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించిగా కొనుగోలు చేసిన వారు ఇండ్ల నిర్మాణం చేసుకున్నారు. అయితే అది ఎస్సారెస్పీ స్థలం అయినప్పటికీ బల్దియా నుండి అనుమతులు రావడం విడ్డూరం. మరో వైపున అది తమ స్థలమంటూ ఎస్సారెస్పీ అధికారుల నిర్మాణంలో ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు రంగంలోకి దిగిన గంటల వ్యవధిలోనే వెనుదిరిగిపోయారని తెలుస్తోంది. దీంతో ఎస్సారెస్పీ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు దర్జాగా రియల్ వ్యాపారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఎస్సారెస్సీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్న విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.

కఠినంగా వ్యవహరించాలి: పైడిపల్లి రాజు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు

ఎస్సారెస్పీ భూముల విషయంలో అధికారులు నిభందనల మేరకు నడుచుకోవడం లేదు. వాటిని కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నగునూరు వెంచర్ నిభందనలకు విరుద్దంగా సుడా అనుమతులు పొందిన తీరులో నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. లేఖలు రాయడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో సరిపెట్టడం సమంజసం కాదు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు చానెల్స్ ధ్వంసం చేసిన అక్షర వెంచర్ నిర్వాహకుల నుండి చానెల్స్ ధ్వంసం చేసిన తాలుకు పరిహారాన్ని వసూలు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులు నమోదు చేయాలి. అలాగే కరీంనగర్ తో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న ఎస్సారెస్పీ భూములపై సమగ్ర సర్వే జరిపి వాటిని రక్షించాలి. కబ్జాకు గురైన వాటిని స్వాధీనం చేసుకుని అక్రమించుకున్న వారిపై వాటిని విక్రయించిన వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేయాలి.

You cannot copy content of this page