గంగలో మునగగానే పునీతులవుతున్నారా..? సైద్దాంతికతకు తిలోదకాలిచ్చినట్టేనా..?

బీజేపీ తీరుపై నెటిజన్ల ఘాటు విమర్శలు…

దిశ దశ, ఖమ్మం:

జాతీయ వాదం… హిందుత్వ నినాదం అంటూ గొంతు చించుకుని ప్రసంగాల పర్వాన్ని కొనసాగించే భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలకు తిలోదకాలిచ్చినట్టేనా..? పార్టీ బలోపేతం కోసం ఎవ్వరినైనా చేర్చుకుంటామని బార్లా గేట్లు తెరుచుకుని కూర్చున్నారా.? వెనకా ముందు ఆలోచించకుండా కాషాయం కండువా కప్పేస్తున్న తీరు సరైందేనా..? ఇప్పుడిదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా సాగుతోంది. బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్పించుకున్నామని ముఖ్య నాయకత్వం చెప్పగానే సరేనని తలలూపుతున్నారు కార్యకర్తలు. ఎత్తిన కాషాయ జెండాను దించడానికి ఏ మాత్రం వెనకాడకుండా ముందుకు సాగుతున్న కార్యకర్తల్లోని మనో ధైర్యాన్ని నీరుగార్చే విధంగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో లేకున్నా… శాసించే స్థాయిలో శాసనసభ్యులు లేకున్నా పార్టీ కోసం పరితపించిన క్షేత్ర స్థాయి క్యాడర్ ను విస్మరిస్తూ కమలనాథులు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ విస్మయపరుస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ ను జాయిన్ చేసుకున్న తీరుపై అయితే నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు తాళలేక బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అందులో ఖమ్మం జిల్లాలో అయితే సాయి గణేష్ అనే కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో డీసీపీగా పనిచేసిన అత్తలూరి సుభాష్ చంద్రబోస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వారితో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు పోలీసు అధికారుల వ్యవహారాన్ని కూడా ఏకీ పారేయడంతో పాటు పోలీసు అధికారి సుభాష్ చంద్రబోస్ తీరుపై కూడా విమర్శలు చేశారు కూడా. అయితే ఇప్పుడు అదే పోలీసు అధికారిని బీజేపీలో చేర్చుకోవడంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు ఆరోపణలు గుప్పించిన అధికారినే అక్కున చేర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సదరు అధికారితో పాటు అతని కుటుంబ సభ్యులపై మునిసిపల్ కమిషనర్ కూడా క్రిమినల్ కేసులు పెట్టారు. అటువంటి అధికారిని బీజేపీలో చేర్పించుకోవడంతో క్రియాశీలక కార్యకర్త సాయి గణేష్ ఆత్మ క్షోభిస్తుందంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి మంత్రి చెప్పినట్టుగా విని అనామకుడైన సాయి గణేష్ పై కక్ష్యగట్టి మరీ క్రిమినల్ కేసులు పెట్టడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులే అదే పోలీసు అధికారిని పార్టీలోకి తీసుకోవడం పట్ల స్థానికంగా విస్మయం వ్యక్తం అవుతోంది.

ధర్మమంటే ఇదేనా..?

దేశం కోసం ధర్మం కోసం అంటూ పదే పదే వల్లె వేసే బీజేపీ నాయకత్వం పార్టీ కోసం పనిచేసిన సాయిగణేష్ ఆత్మహత్య చేసుకునేలా చేసిన అధికారులను పార్టీలో చేర్పించుకోవడం ఎంతవరకు ధర్మమంటూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఖమ్మం జిల్లాకు వచ్చి సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించి మరీ సాయిగణేష్ మరణానికి కారుకుడైన పోలీసు అధికారిపై రివైంజ్ తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అటువంటి ఆరోపనలు చేసిన బీజేపీ నాయకులే ఆ అధికారికి కాషాయం కండువా కప్పి మరీ పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమో కమలనాథులకే తెలియాలి.

You cannot copy content of this page