సీడీఆర్ వివరాలు లోన్ యాప్స్ వాలాల చేతికి… చట్టాలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే వారేరీ..?

దిశ దశ, మంచిర్యాల:

మీ స్నేహితుడు మా వద్ద అప్పు తీసుకున్నాడు… తిరిగి చెల్లించడం లేదు… మీరు చెల్లిస్తారా లేనట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోమంటారా అంటూ వాట్సప్ మెసెజ్ వస్తోంది కొందరికి… లేనట్టయితే కాల్ చేసి మరీ ఇబ్బందులు పెడుతున్నారు… తమ స్నేహితుడు లోన్ తీసుకుంటే తమను బాధ్యులను చేయడం ఏంటని వాపోతున్నారు చాలామంది. లేనట్టయితే కాల్స్ చేసి మరీ బెదిరింపులకు గురి చేస్తున్నారు రుణం ఇచ్చిన సంస్థల తరుపు రికవరీ ఏజెంట్లు… ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా, ట్రాయ్ రూల్స్ ను అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్న తీరు సంచలనంగా మారింది.

కాల్స్ డాటా ఎలా..?

సాధారణంగా రుణం తీసుకున్న వారి నుండి రెఫరెన్స్ నంబర్లు తీసుకోవడం, ష్యురిటీ ఇచ్చిన వారి కాంటాక్టు నంబర్లు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో లోన్ యాప్స్ నిర్వాహకులు మాత్రం సదరు రుణ గ్రహితతో కాల్స్ మాట్లాడే ప్రతి ఒక్కిరిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. లీగల్ గా ప్రొసీడ్ అవుతామంటూ వాట్సప్ మెసెజులు చేస్తున్నారు. లోన్ ఇచ్చిన సంస్థలు రెఫరెన్స్, ష్యురిటీగా ఉన్న వారి నంబర్లకు కాకుండా వేరే నంబర్లకు ఎలా ఫోన్లు చేస్తున్నారు..? ఆ వివరాలు ఆ సంస్థలకు ఎలా తెలుస్తున్నాయన్నదే మిస్టరీగా మారింది. కాల్స్ డిటైల్డ్ రికార్డ్ (సీడీఆర్) సదరు మొబైల్ కంపెనీకి ఎఫ్ఐఆర్ జారీ చేసిన తరువాత పోలీసులు లేఖ రాస్తే తప్ప ఇచ్చే అవకాశం లేదు. చట్టాలకు లోబడి తీసుకోవల్సిన కాల్స్ డాటా వివరాలు లోన్ యాప్స్ నిర్వాహకులకు చేరుతుండడం ఆందోళన కల్గిస్తున్నది. లోన్ యాప్ప్ వాలాలు కేవలం రెఫరెన్స్, ష్యురిటీ నంబర్లకు మాత్రమే మెసేజ్ చేయకుండా రుణ గ్రహీతలకు సంబంధించిన మొబైల్ డాటా ఆధారంగా పలువురికి నోటీసులు పంపడమో లేక ఫోన్లు చేసి వేధింపులకు గురి చేయడమో చేస్తున్నారు. దీంతో రుణం తీసుకున్న వారితో స్నేహం చేసిన వారు కూడా హెచ్చరికలు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా లోన్ యాప్స్ వాలాలు ఫోన్ నంబర్ల వివరాలు ఎలా సేకరిస్తున్నారన్న విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే తమకు సంబంధం లేకుండా రుణాలు ఇచ్చిన సంస్థలు ఇలా వేధింపులకు గురి చేసినట్టయితే తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలయడం వెనక కుట్ర పూరితమైన నేరం దాగి ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో లోన్ యాప్స్ వాలాల అక్రమాల భాగోతం గుట్టు రట్టు అవుతుంది. లేనట్టయితే వీరి అగడాలు రోజు రోజుకు మితిమీరిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఒకరిద్దరు అధికారులకు సంబంధించిన కాల్స్ వివరాలు సేకరించేందుకు తప్పుడు ఫిర్యాదులు చేసి వివరాలు సేకరించిన విషయంపై కేసులు కూడా నమోదయ్యాయి. లోన్ యాప్స్ నిర్వహకులతో ఎలాంటి సంబంధం లేకున్నా కాంటాక్ట్ నంబర్ కు కాల్ చేయడం కానీ, వాట్సప్ మెసెజులు చేయడం కానీ చేసినట్టయితే వారిపై కోర్టులను ఆశ్రయించి చట్టపరమైర చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం కూడా ఉంటుంది. తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడంతో పాటు తమ వ్యక్తిగత విషయాలు సేకరించిన తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోర్టులను ఆశ్రయించినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సదరు సంస్థల ప్రతినిధులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఆర్బీఐ రూల్స్ ..?

అయితే లోన్ ఇచ్చేముందే అన్ని రకాలుగా డాక్యూమెంట్లను సరి చూసుకోవల్సిన సంస్థలు ఒకటి రెండు వాయిదాలు కట్టనట్టయితే రికవరీ ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నారు. రికవరీ ఏజెంట్లు ఇష్టారీతిన వ్యవహరించినట్టయితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. రిజర్వూ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్దంగా రికవరీ ఏజెంట్లను రంగంలోకి దింపి దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలపై RBI అంబూడ్స్ మెన్ విభాగంలో ఫిర్యాదు చేసినట్టయితే బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. . రికవరీ ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే విషయంలో ఆర్బీఐ వెసులుబాటు కల్పించినప్పటికి వారికి కూడా కొన్ని నిబంధనలు రూపొందించింది. వాటిని అతిక్రమించకుండా రుణాలు రికవరీ చేసుకోవాలని స్పష్టం చేసింది.

తాజాగా ఇలా…

పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చిన లోన్ ఇచ్చే సంస్థల తరుపు ప్రతినిధులు రుణం ఇస్తామంటూ తరుచూ ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు ప్రైవేటు ఏజెన్సీలకు ఈ బాధ్యతలు అప్పగించడంతో ప్రత్యేకంగా రిసెప్షనిస్టులను ఏర్పాటు చేసుకుని మరీ రుణాలు ఇస్తామంటూ వెంటపడుతుంటారు. దీంతో ఎదో ఒక బలహీన క్షణంలో అప్పు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడమే ఆలస్యం అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాయి సదరు సంస్థలు. ఆ తరువాత వసూళ్ల కో్సం ఇష్టా రీతిన రికవరీ ఏజెంట్లను పంపించి పరువును బజారుకీడుస్తున్నాయి. వీరి బాధలు తట్టుకోలేక చాలా మంది బలవన్మరణాలకు పాల్పడుతున్న సందర్బాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ తమ కాంటాక్ట్ నంబర్ రుణం ఇచ్చే సంస్థకు కానీ, ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఫాంఛైజీలకు కానీ ఎలా చేరిందన్న విషయంపై కూడా ఆర్బీఐకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సాహసం ఎవరూ చేయకపోవడంతో విపరీతంగా పెరిగిపోయిన లోన్ యాప్స్ సంస్థలు సామాన్యులకు రుణం ఇస్తామంటూ ఎర వేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన ఓ సింగరేణి కార్మికుడు లోన్ తీసుకున్న తరువాత అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో నాలుగు వాయిదాలు చెల్లించకపోవడంతో అతని ఇంటి చుట్టూ రికవరీ ఏజెంట్ల క్యూ కట్టారు. ఒకరు కాకుంటే ఒకరు రుణం చెల్లించాలంటూ ఇంటికి వచ్చి దురుసుగా మాట్లాడుతున్నారు. కనీసం సంస్థ ఐడీ కార్డు కానీ, లోన్ స్టేట్ మెంట్ కానీ చూపించడం లేదని వారు వాపోతున్నారు. అసలు వచ్చిన వారు కంపెనీ ప్రతినిధులా కాదా అన్న విషయంపై కూడా స్పష్టత లేకుండా పోతోంది. అంతేకాకుండా మొదట వచ్చిన ఏజెంటు ద్వార సదరు సంస్థ మేనేజర్ తో మాట్లాడిన తరువాత కూడా మరో రికవరి ఏజెంటు రంగంలోకి దిగుతున్నాడు. దీంతో వీరికి సమాధానం చెప్పడానికే తమ సమయమంతా సరిపోతోందని వాపోతున్నారు. అలాగే తమతో స్నేహం చేసిన పాపానికి తమకు కాంటాక్ట్ లో ఉన్న వారిలో చాలామందిని కూడా ఇదే విధంగా బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు లోబడి నడుచుకోవాలి: ఎన్నంపల్ల గంగాధర్, అడ్వకేట్

లోన్ రికవరీకి రిజర్వూ బ్యాంకు కొన్ని నిబంధనలు రూపొందించింది. వాటిని అనుసరించాల్సిన బాధ్యత సంస్థలపై ఉంది. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని స్పష్టం చేసింది. డిఫాల్టర్ల విషయంలో నిబంధనల మేరకు నడుచుకోనట్టయితే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సైబర్ సంబంధిత అంశాల ద్వారా రుణం రికవరీ కోసం ప్రయత్నించడంలో నిబంధనలు అతిక్రమిస్తే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రిజర్వూ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉండే అంబూడ్స్ మెన్ వింగ్ కు కూడా ఫిర్యాదు చేసినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించి సైబర్ క్రైం కింద చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేయడంతో పాటు రిజర్వూ బ్యాంకును కూడా కమిషన్ ద్వారా సూచించే అవకాశం ఉంటుంది. లోన్ తీసుకున్న వారు ఇచ్చే రెపరెన్స్ నంబర్లు, ష్యురిటీ హోల్డర్స్ కాంటాక్ట్ నంబర్లు కాకుండా ఇతర కాంటాక్ట్ నంబర్లకు ఫోన్ చేయడం లేదా మెసేజ్ చేసినా వ్యక్తిగత హక్కులకు భంగం కల్గించారని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం కూడా ఉంటుంది. మన మొబైల్ నంబరు ఇతరులు ఎవరైనా వినియోగిస్తున్నారా అన్న వివరాలు తెలుసుకునేందుకు ‘‘సంచార్ సధి’’ ద్వారా తెలుసుకునే అవకాశం కూడా ఉండడంతో పాటు ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉంది.

You cannot copy content of this page