దిశ దశ, కరీంనగర్:
నిన్న మొన్నటి వరకు ఆ పోలీసు అధికారే లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయనది. భూ కబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఆ అధికారే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు… తన కేబుల్ ఛానెల్ లోనూ పోలీసుల తప్పిదాలను ఎత్తి చూపుతూ కథనాలు… చివరకు బహిరంగ లేఖ రాసి పోలీసులపై ఆరోపణల పర్వం కొనసాగించారు… ఇదంతా గతం…
అదే పోలీసు అధికారి చాలా వరకూ మంచి పనులు చేస్తున్నారు. ఆయనపై అధికార పార్టీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం సరికాదు. కమిషనరేట్ పరిధిలో 80 శాతం వరకూ మంచే జరుగుతోంది. అంటూ ఓ వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో పంపించడం… ఆ తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యే టార్గెట్ గా కౌంటర్ అటాక్ చేస్తున్నారు… ఇదంతా ప్రస్తుతం…
కరీంనగర్ కమిషనరేట్ లో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిని వెంటాడి వేటాడుతున్నారు పోలీసులు. సీపీ అభిషేక్ మహంతి బాధ్యతలు తీసుకున్న తరువాత వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) ఏర్పాటు చేశారు. బాదితులు ఫిర్యాదు రాగానే సాక్ష్యాధారాలు సేకరించి వారిచ్చిన ఫిర్యాదులో ఉన్న వాస్తవాలు ఏమిటీ అన్న విషయాలపై సమగ్రంగా ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు రెవెన్యూ కార్యాలయాల్లో జరిగిన తప్పిదాలను, రికార్డుల్లో ఉన్న విషయాలను పరిశీలించి క్రిమినల్ కేసులు పెడుతున్నారు. భూ సంబంధిత ఫిర్యాదు అనగానే సివిల్ మ్యాటర్ అన్నట్టుగా వ్యవహరించిన పోలీసులు, సీపీ అభిషేక్ మహంతి రాగానే డాక్యూమెంట్స్ ట్యాంపరింగ్, ఛీటింగ్ వంటి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కుట్రకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేస్తుండడంతో నిందితులు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నాయి కోర్టులు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కు చెందిన చాలా మంది ప్రముఖులపై కేసులు నమోదవుతున్నాయని, కబ్జాదారుల భరతం పట్టడం ఖాయంగా మారిపోయిందన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. దీంతో వందల సంఖ్యలో కేసులు నమోదు కాకుండా పరిష్కారం అయ్యే దిశ వైపు అడుగులు వేశాయి. బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే అవకాశం ఉందని భావించిన వెంటనే కబ్జాదారులు వారిని బ్రతిమాలి మరి భూములు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ కోసం తిరుగుతున్నారన్న అనుమానం ఉన్నవారు చాలా మంది కూడా నగరాన్ని వదిలి పెట్టి వెల్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి విదేశాలకు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులకు వస్తున్న ఫిర్యాదుల్లో కొత్త జైపాల్ రెడ్డి భాగస్వామ్యం ఉన్నదని తేలితే ఆయనపై కేసులు పెట్టడంలో వెనకాడడం లేదు పోలీసులు. తాజాగా చిట్టుమళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అయిన కేసులో కూడా కొత్త జైపాల్ రెడ్డిని నిందితునిగా చేర్చారు.
‘‘కొత్త’’ వాదనలు…
అప్పట్లో కేసుల భయంతోనే తాను విదేశాలకు వెల్లి తల దాచుకుంటున్నానని ప్రచారం చేస్తున్న విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జైపాల్ రెడ్డి. సీపీ అభిషేక్ మహంతికి రాసిన బహిరంగ లేఖలో తాను ఫిబ్రవరిలో విదేశాలకు వెల్లిన తరువాత కేసులు నమోదయ్యాయని అటువంటప్పుడు తాను కేసుల భయంతో విదేశాలకు వెల్లినట్టుగా తప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తప్పిదాలను, కొంతమంది పోలీసు అధికారులు కావాలని చేస్తున్న వ్యవహరాలను కూడా ఆ లేఖలో ఎత్తి చూపారు కొత్త జైపాల్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కేబుల్ ఛానెల్ లో కూడా పోలీసుల వైఫల్యాలు, కేసుల పరిశోధనకు సంబంధించిన తప్పిదాలను ఎత్తి చూపుతూ వార్తా కథనాలు వేయించారు. సీపీ టార్గెట్ గా వేసిన ఈ వార్తా కథనాలు సరికొత్త చర్చకు దారితీశాయి. జైపాల్ రెడ్డి పోలీసులు తప్పిదాలను ఎత్తి చూపుతున్న తీరు వెనక ఉన్న కారణాలు ఏంటీ..? బాధితులకు జరుగుతున్న అన్యాయం ఏంటీ అన్న విషయాలపై ప్రసారం చేసిన ఈ కథనాల గురించి పోలీసు వర్గాలు కూడా ఇలాంటి వార్తలు ప్రసారం చేయడమేంటి అన్న అంశంపై తర్జనభర్జనలు పడ్డారు. దీంతో కరీంనగర్ పోలీసులు వర్సెస్ కొత్త జైపాల్ రెడ్డి అన్నట్టుగా మారిపోయిందన్న భావనకు వచ్చారు పలువురు.
ఇప్పుడిలా…
అయితే తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సీపీ అభిషేక్ మహంతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దళితుల పట్ల సీపీ వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రికమండ్ చేసిన వారిలో కొంతమంది దళిత అధికారులు ఉన్నప్పటికీ వారిని కూడా తిప్పి పంపారని విమర్శించారు. ఈ అంశం నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో సీఐలు ఎస్ హెచ్ ఓలుగా పనిచేస్తున్న స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, ఎస్సైలు ఎస్ హెచ్ ఓలుగా వ్యవహరిస్తున్న ఠాణాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఇంఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిలో ఎవరెవరు ఉన్నారు అన్న వివరాలను వెలుగులోకి తేవడం జరిగింది. ముందుగా ఇతర వెబ్ సైట్లలో వచ్చిన వార్తా కథనాలను ఆధారం చేసుకుని మరిన్ని వివరాలను జోడించి కొత్త జైపాల్ రెడ్డి కేబుల్ నెట్ వర్క్ లోనూ ప్రసారం చేశారు. అయితే ఈ అంశంపై ఎమ్మెల్యే కవ్వపంల్లి కూడా జైపాల్ రెడ్డిని ఉద్దేశించి కౌంటర్ అటాక్ చేశారు. ఇందుకు జైపాల్ రెడ్డి కూడా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ టార్గెట్ గా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇంతకాలం ఏ పోలీసులు లక్ష్యం చేసుకుని ఆరోపణలు చేశారో… ఇప్పుడదే పోలీసులు సరైన పంథాలోనే నడుస్తున్నారని కొత్త జైపాల్ రెడ్డి చెప్తుండడం గమనార్హం. అప్పుడు బాహాటంగానే తన అంతరంగాన్ని వ్యక్తీకరించిన ఆయన ఇప్పుడు కూడా ఓపెన్ గానే తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన పోలీసులను వెనకేసుక రావడానికి కారణం ఏంటీ అన్న చర్చే స్థానికంగా సాగుతోంది. రాజకీయంగా రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో ‘‘కొత్త’’కు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని అనచరులు చెప్తుంటారు. కీలక వ్యక్తులతో ఉన్న అనుబంధాలున్న వ్యక్తి ఉన్నట్టుండి పోలీసుల మంచితనాన్ని కీర్తించడం వెనక ఉన్న అసలు కారణం ఏంటీ అన్నదే పజిల్ గా మారింది. ఒక వేళ పోలీసులను మచ్చిక చేసుకునేందుకు వ్యవహరిస్తున్నారా అంటే ఇంతకాలం వారిని టార్గెట్ చేసి వ్యవహరించిన వ్యక్తి ఇలా ఎందుకు మారుతారు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. కవ్వంపల్లి సత్యనారాయణతో ఏమైనా విబేధాలు పొడసూపాయా అనుకుంటే… చొప్పదండి నియోజకవర్గానికి చెందిన ఆయనకు మానకొండూరుకు సంబంధం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సీపీ లక్ష్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకంటే ఎక్కువగా చర్చ కొత్త జైపాల్ రెడ్డి వైఖరిపైనే అన్నది మాత్రం వాస్తవం.