ముగ్గురు అధికారుల మృత్యువాత
దిశ దశ, న్యూ ఢిల్లీ:
జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు, పోలీసు బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన అనంత నాగో్ జిల్లా కోకెర్ నాగ్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు. అక్కడి అటవీ ప్రాంతంలో ఉగ్ర వాదులు షెల్టర్ తీసుకున్నాయన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు మంగళవారం రాత్రి నుండి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. బుధవారం ఉదయం వరకు కొనసాగిన ఈ కూంబింగ్ ఆపరేషన్ లో భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడంతో బలగాలు కూడా ఎదురు దాడికి పూనుకున్నాయి. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ మన్ ప్రీత్ సింగ్, ఆర్మీ మేజర్ మనోజ్ అశీష్, డీఎస్సీ స్థాయి అధికారి హుమాయూన్ భట్ లు తీవ్ర గాయాలపాలయ్యారు. ఓ వైపున ఉగ్ర మూకలపై కౌంటర్ అటాక్ చేస్తూనే మరో వైపున గాయపడిన అధికారులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. టెర్రరిస్టులు నిరాంటకంగా దాడులకు పాల్పడడంతో తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురు అధికారులను వైద్యం కోసం తరలించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ముగ్గురు అధికారులు కూడా మృత్యువాత పడడంతో జమ్మూ కశ్మీర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బలగాల దాడుల్లో ఇద్దరు టెర్రరిస్టులు కూడా చనిపోయినట్టు జమ్మూకశ్మీర్ అధికార వర్గాలు చెప్తున్నాయి.