వేచరిణి గ్రామస్తు కష్టాలు
దిశ దశ, సిద్దిపేట:
తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సాహసం చేయడం సాధారణం… కానీ ప్రాణం కోల్పోయిన మనిషి కోసం కూడా ప్రాణాలకు తెగించేంత సాహసం చేయడం ఎక్కడైనా చూశారా..? శవం పట్టుకుని మరీ ఎదురీదుకుంటూ వెల్లాల్సిన పరిస్థితులను ఎవరైనా ఎదుర్కొంటారా..? కానీ ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణలో జరిగింది. నిరాటంకంగా కురుస్తున్న వర్షాలతో వరదలు అన్ని ప్రాంతాల్లో ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎప్పుడు ఎటు వైపు నుండి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో వారు సాహసానికే సాహసం చూపించారు. సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని చేర్యాల మండలం వేచరణి గ్రామానికి చెందిన బాలయ్య మంగళవారం మరణించారు. ఆయన అంతిమ సంస్కారం చేయాలంటే గ్రామ పొలిమేరల మీదుగా ప్రవహిస్తున్న వాగును దాటితే తప్ప శ్మశానం చేరుకునే పరిస్థితి లేదు. ఎగువ ప్రాంతం నుండి పొంగిపొర్లుతున్న వరదను చూస్తే పాడెను అవతలికి తీసుకెళ్లడం కష్టంగానే ఉంది. అయినప్పటికీ బాలయ్య శవాన్ని శ్మశానానికి తీసుకెల్లడం తప్ప మరో అవకాశం మాత్రం వేచరిణి గ్రామస్థులకు లేకుండా పోయింది. దీంతో సాంప్రాదాయ బద్దంగా బాలయ్య కుటుంబ సభ్యులు, బంధువులు బాలయ్య మృతదేహాన్ని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు నీటి నుండే శ్మశాన వాటికకు తరలించి ఆఖరి మజిలీ తంతును పూర్తి చేశారు. బాలయ్య మృత దేహాన్ని తరలిస్తున్న క్రమంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అంత్యక్రియల్లో పాల్గొన్న వారి ప్రాణాలకు మాత్రం గ్యారెంటీ లేదనే చెప్పాలి. మత్తడి దూకుతున్న వాగు నీటి ప్రవాహంలో శవాన్ని తీసుకెల్తున్న వారిలో ఏ ఒక్కరి కాలు జారినా ప్రాణాలతో మాత్రం బ్రతికి బట్టకట్టే పరిస్థితులు అయితే లేవు. అయినప్పటికీ అత్యంత సాహసోపేతంతో బాలయ్య అంత్యక్రియల తంతును పూర్తి చేసి గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని వేచరిణి గ్రామస్థులు వంతెన నిర్మాణానికి చొరవ తీసుకోవాలని చేసిన వినతులు మాత్రం బుట్ట దాఖలే అయ్యాయి. వర్షా కాలం వస్తే చనిపోయిన వారి దహన సంస్కరాలు చేసేందుకు వెల్లే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని… కాదు కాదు… వరద నీటిపై పెట్టుకుని తంతు పూర్తి చేస్తున్నారు. ఇకనైనా ఇక్కడ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టి చనిపోయిన వారి కోసం బ్రతికున్న వారి ప్రాణాలు తీయకుండా చూడాలని వేడుకుంటున్నారు వేచరణి గ్రామస్థులు.