కొండాయి గ్రామస్థుల చివరి వీడియో ఇదే…
దిశ దశ, ములుగు:
చివరి ప్రయత్నమే వారి చివరి శ్వాసను తీసేసిందా..? ఊరిని ముంచెత్తితే తామూ చనిపోతామన్న భయం వారిని వెంటాండిందా..? పొంగి ప్రవహిస్తున్న వరద నీటిలోనూ బ్రతుకు జీవుడా అనుకుంటూ అతృతపడడమే విగతజీవులుగా మార్చిందా..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఒకటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. కొండాయి గ్రామానికి చెందిన అడవి బిడ్డలు వాగు దాటుకుంటూ వెల్తుండగా చివరి సారిగా తీసిన వీడియోను గమనిస్తే బాధాకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కొండాయి ఆదివాసీల కష్టం…
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామాన్ని చుట్టుముట్టిన వరదలు అక్కడి అడవి బిడ్డలను ఏ స్థాయిలో భయపెట్టాయో స్పష్టం చేస్తోందా వీడియో. ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరదల వల్ల ములుగు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లిన సంగతి తెలిసిందే. జలదిగ్భందనంలో చిక్కుకున్న కొండాయి వాసులు ఏమయ్యారోనన్న సంగతి కూడా రెండు మూడు రోజుల వరకూ తెలియని పరిస్థితి. గ్రామం చుట్టూ వరద నీరు చేరడం, వంతెనలు కొట్టుకపోవడంతో దారి తెన్ను లేకుండా పోయిందా గ్రామానికి. అయితే వరద బీభత్సం సృష్టించిన రోజునే కొండాయి గ్రామం అంతా మునిగిపోతుందన్న ఆందోళన అక్కడ నివసిస్తున్న ఆదివాసీ బిడ్డల్లో నెలకొంది. వరదల్లో చిక్కుకోకుంటే అదే పదివేలు అనుకుంటూ బిక్కు బిక్కుమంటు పిల్లా పాప, ముసతి ముతక కాలం వెల్లదీశారు. అయితే క్రమక్రమంగా వరదలు ఉధృతంగా పెరగుతుండడంతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వరద నీటిని దాటితే చాలు క్షేమంగా బ్రతుకుతామని అంచనా వేసుకుని గ్రామాన్ని వదలి వెల్లినట్టుగా భావిస్తున్నారు. కొండాయి నుండి వరద నీటిలో నడుచుకుంటూ వెల్తున్న సుమారు 10 మంది కొద్ది దూరం వెల్లిన తరువాత్ నీటిలోనే మునిగిపోయారు. వీరంతా గ్రామం నుండి ఆ సమయంలో బయటకు రావడానికి కారణం ప్రాణాలు కాపాడుకునేందుకే అయి ఉంటుందన్న చర్చ సాగుతోంది. వీరు వరద నీటిని దాటుతుండగా తీసిన వీడియోలో కూడా వీరంతా కొండాయి నుండి వెల్తున్నట్టుగా ఉండడంతో అలాంటి క్లిష్ట సమయంలో వారెందుకు బయటకు వచ్చి ఉంటారన్నదే మిస్టరీగా మారింది. కాని పరిస్థితులను గమనిస్తే మాత్రం వీరంతా కూడా ప్రాణాలో బ్రతుకుతామన్న ఆశతోనే సాహసం చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు వెల్లిన వీరంతా కూడా అదే వరదల్లో కొట్టుకపోవడం స్థానికంగా విషాదాన్ని ముంచెత్తింది.
గ్రామంలో ఉన్నా…
వరద ఉధృతిలో గ్రామస్థులతో కలిసి ఉన్నా వారంతా బ్రతికేవారేమోనని, వరద నీటిని దాటే ప్రయత్నం చేసి చివరి శ్వాస విడిచారని భావిస్తున్నారు. కొండాయి గ్రామంలో భయం భయంగా కాలం వెల్ల దీసినప్పటికీ ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. వరదల్లో బయటకు వచ్చిన వారిలో ఎనిమిది మందిని మృత్యువు కబళించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టుకుంటున్నారు.