దిశ దశ, జగిత్యాల:
రాష్ట్రంలోనే అత్యంత ప్రాశస్త్యం ఉన్న కొండగట్టు అంజన్న క్షేత్రం జై శ్రీరాం నినాదాలతో మారుమోగుతోంది. లక్షలాది మంది హనుమాన్ దీక్షా పరులు ఇక్కడకు చేరుకోవడంతో కాషామయంగా మారిపోయింది. ఆదివారం పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం అర్థరాత్రి నుండే భక్తులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మాల విరమణ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు 3 లక్షల మంది భక్తులు చేరుకున్నారని అంచనా వేస్తున్నారు. స్వామి వారి దర్శనానికి మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతోంది.
భారీ బందోబస్తు
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకుంటారని అంచనా వేసిన జగిత్యాల జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల, కరీంనగర్ ప్రధాన రహదారి, నాచుపల్లి జెఎన్టీయూ రోడ్డు తదితర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పకడ్భందీగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఎస్సీ భాస్కర్ నేతృత్వంలో డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ ల బందోబస్తు చేపట్టారు. పోలీసులు గస్తీ నిర్వహిస్తూనే డ్రోన్ కెమెరాలతో కూడా నిఘాను కట్టుదిట్టం చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు కొండగట్టు పరిసర ప్రాంతాలన్ని కూడా ఎప్పటికప్పుడు డ్రోన్ కెమారాలు రికార్డు చేస్తున్నాయి.