Telangana: క్రిప్టో కరెన్సీ పేరిట వసూళ్లు… మాజీ ఎమ్మెల్యే సహా పలువురు పెట్టుబడులు…

తప్పించుకుని తిరుగతున్న ఓ లీడర్…

దిశ దశ, కరీంనగర్:

క్రిప్టో కరెన్సీ… అంతర్జాతీయంగా ఇప్పుడీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆన్ లైన్ లోనే ఇన్వెస్టిమెంట్ చేయాల్సిన క్రిప్టో కరెన్సీలో యజమాని ఎవరో తెలియదు.. కానీ కలల ప్రపంచం చూపించే ఏజెంట్లు మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తుంటారు. అలాంటి ఓ ఏజెంటు మాటలు నమ్మి కరీంనగర్ కు చెందిన వారు బోల్తా పడిపోయారు. పొలిటికల్ లీడర్ కూడా అయిన ఆయన హైదరాబాద్ కు చెందిన మరో ఏజెంటు ద్వారా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టించినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నడిబొడ్డున నివాసం ఉండే ఈ నాయకుని మాటలు నమ్మిన చాలా మంది పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఓ మాజీ ఎమ్మెల్యే సహా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికార యంత్రాంగం, వ్యాపారులు చాలా మంది ఆ లీడర్ మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. దాదాపు 30 కోట్ల వరకు ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ఆ నాయకుడి మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది.

ఎన్నికలకు లింక్…

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో చేతులెత్తేస్తున్నానని సదరు నాయకుడు, హైదరాబాద్ కు చెందిన ఏజెంట్ ఇద్దరు కూడా పెట్టుబడులు పెట్టిన వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ క్రిప్టో కరెన్సీకి భారతదేశంలోని ఓ రాష్ట్రం అయిన మహారాష్ట్ర ఎన్నికలకు ఏం సంబంధమో కానీ వారు మాత్రం ‘‘ బొడి గుండుకు… మోకాలి’’కి ముడి పెట్టి తప్పించుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఓ చెక్ ఇచ్చినప్పటికీ అతని అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో మళ్లీ కరీంనగర్ లీడర్ ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పెట్టుబడి దారులు. దీంతో ఫిబ్రవరి నెల వరకు ఆగాలన వారిని బుజ్జగించి పంపించినట్టుగా తెలుస్తోంది.

మూడు నెలలుగా…

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన సదరు నాయకుడు మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు లబోదిబోమని చెప్తున్నారు. అతని ఆచూకి పట్టుకునేందుకు స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తోందని… తమకు చిక్కిన తరువాత ఎదో ఒక వాయిదా పెట్టి వెల్లిపోతున్నాడని చెప్తున్నారు. ఫిబ్రవరి నెల వరకు ఆగి అతని ఆచూకి దొరకబట్టుకుని డబ్బులు వసూలు చేసుకోవాలని కొంతమంది ఆలోచిస్తుంటే అప్పుడూ వాయిదా పెడితే ఎలా అని భయపడిపోతున్నారు చాలామంది. ఎలాగైనా అతని వద్ద నుండి డబ్బులు ఇప్పించాలని పలుకుబడి ఉన్న వారిని ఆశ్రయిస్తున్నారు మరికొంతమంది. ఇచ్చేవాడే లేనప్పుడు డబ్బులు వసూలు చేయడం ఎలా అని ఎదురు ప్రశ్నలు కూడా వస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక వారంతా తలలు పట్టుకుంటున్నారు.

నిజమేనా..?

అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట వసూలు చేసిన ఈ నాయకుడు వారి టీమ్ నిజంగానే అందులో ఇన్వెస్టిమెంట్ కోసమే తమ నుండి డబ్బులు తీసుకున్నారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. పెట్టుబడి పెట్టించిన లీడర్ తమకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న తీరుతో పాటు, తమకు హైదరాబాద్ నగరానికి చెందిన ఏజెంట్ కు సంబంధించిన చెక్ ఇవ్వడంతో అనుమానం వస్తోందని బాధితులు అంటున్నారు. ఏది ఏమైనా ఓ పొలిటికల్ లీడర్ క్రిప్టో కరెన్సీ పేరిట కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టించిన అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page