క్రిప్టో కరెన్సీపై కొరడా… అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు…

దిశ దశ, కరీంనగర్:

క్రిప్టో కరెన్సీ మాయలో పడిపోయి కోట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి చేదు విషయమే ఇది. క్రిప్టో ద్వారా పెట్టుబడులు పెట్టి దండిగా లాభాలు గడిస్తామని కలలు కంటున్న వారు అలెర్ట్ కావల్సిన అవసరం ఉంది. కరీంనగర్ సైబర్ సెక్యూరిటీ వింగ్ అధికారులు క్రిప్టో కరెన్సీ కేసులో ఓ నిందితున్ని అరెస్ట్ చేశారు. ఈ స్కీం అంతా బూటకమన్న విషయాన్ని గమనించకపోతే నిండా మునగాల్సి వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తేల్చి చెప్తోంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారుల కథనం ప్రకారం… రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన అరుణ్ చౌధరి (34) గారిసన్ ఇంజనీర్ బనార్ (మిలటరీ ఇంజనీరింగ్ సర్విసెస్)లో ఎలక్ట్రిషియన్ గా పని చేస్తున్నాడు. క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఏజెంట్ రిచర్డ్ ఆప్ట్ గా వ్యవహరిస్తున్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా కరీంనగర్ కు చెందిన సాయికృష్ణ గౌడ్ ను క్రిప్టో ట్రేడింగ్ ఊబిలోకి దింపాడు. సాయి కృష్ణ గౌడ్ అరుణ్ ఛౌదరి మాటలు నమ్మి ఈ ఏడాది ఎప్రిల్ 7 నుండి 16 ఎప్రిల్ వరకు యూపీఐ ద్వారా రూ. 1.58 లక్షలు బదిలీ చేశాడు. ఆ తరువాత టెలిగ్రామ్ యాప్ నుండి అతని ప్రొఫైల్ తొలగించాడు. కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు నిందితుని కోసం ఆరా తీయడం ఆరంభించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని నిందితుడు అరుణ్ ఛౌదరిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ నెల 19న నిందితున్ని జోధ్ పూర్ లో అరెస్ట్ చేసిన కరీంనగర్ సీసీఎస్ పోలీసులు అక్కడి కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కరీంనగర్ కు తీసుకవచ్చారు. నిందితుడు అరుణ్ ఛౌదరిపై తమిళనాడులో రెండు కేసులు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు నిర్ణయించారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చిన పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేయాలని నిర్ణయించారు. క్రైం నంబర్ 32/2024 సెక్షన్ 420 ఐపీసీ, ఐటీ యాక్ట్ 66డి, సీసీపీఎస్ లో అరుణ్ చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుండి ఒక మొబైల్, రూ. 1.58 లక్షలు రికవరి చేశారు. డీవైఎస్పీ వి నరసింహరెడ్డి పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ సునీల్ నేతృత్వంలోని సీసీఎస్ బృందం నిందితున్ని పట్టుకున్నారు. వీరిని టీజీసీఎస్బీ డైరక్టర్ అభినందించారు.

You cannot copy content of this page