సైబరాబాద్ శివార్లలో ఎస్ఓటీ దాడులు
వెలుగులోకి సంచలన విషయాలు…
దిశ దశ, హైదరాబాద్:
ఇతర రాష్ట్రాల నుండి గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ కావడమే కాదు… ఏకంగా అంతరపంటగా సాగు కూడా అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా గంజాయి ఘాటు గుభాళిస్తున్న క్రమంలో ప్రత్యేక దాడులు చేస్తున్నారు పోలీసులు. ఒడిశా నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలి వస్తున్న గంజాయి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోంది. కొంతమంది అక్రమార్కులు అయితే ఏకంగా చాక్లెట్లలో గంజాయి కలిపి తయారు చేసి విక్రయిస్తున్నారు. చిరు ప్రాయంలోనే గంజాయి మత్తును అలవాటు చేసి బావి తరాల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. అయితే తాజాగా సైబారాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ గంజాయి సాగును కూడా ట్రేస్ చేసింది. గతంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సాగయిన గంజాయి ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ మహానగర శివార్లలోనే అంతరపంట రూపంలో సాక్షత్కరించడంతో పోలీసు అధికారులు షాకయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్రనగర్ ఎస్ఓటి టీమ్ గంజాయి పంటను గుర్తించి రైతును అదుపులోకి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని రావులపల్లి కలాస్ గ్రామ వ్యవసాయ భూముల్లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్న విషయాన్ని గుర్తించింది. హరిజన సుధీర్ (50) అనే రైతు తన వ్యవసాయ భూమిలో అంతరపంటగా గంజాయిని సాగు చేస్తుండగా ఎస్ఓటీ టీమ్ పట్టుకుంది. నిందితునితో పాటు కేసు పూర్తి వివరాలను ఎక్సైజ్ విభాగానికి ఎస్ఓటీ బృందం అప్పగించడంతో దర్యాప్తు చేపట్టారు.