ముగుస్తున్న కస్టడీ… సోదాలు చేస్తున్న ఈడీ…

దిశ దశ, హైదరాబాద్:

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మరికొన్ని గంటల్లో కోర్టులో హాజరు పర్చనున్నారు. ఇదే సమయంలో ఈడీ బృందాలు హైదరాబాద్ లో ప్రత్యక్ష్యం కావడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని మదాపూర్ లో నివాసం ఉంటున్న కవిత ఆడపడుచు అఖిలతో పాటు ఆమె మెట్టినింటికి సంబంధించిన బందువుళ ఇళ్లలో ఈఢీ అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. శనివారం తెల్లవారు జాము నుండే ఈ సోదాలు ప్రారంభం కావడం సంచలనంగా మారింది. కవిత కస్టడీలో ఉన్నప్పుడు ఆమె నుండి ఈడీ అధికారులు సమాచారం రాబట్టారా లేక అనుమానంతోనే సోదాలు చేస్తున్నారా అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన విషయంలో కవితను అరెస్ట్ చేసిన రోజే ఆమె భర్తతో పాటు మరి కొందరిని కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిలో ఎవరైనా కీలకమైన సమాచారాన్ని ఈడీ విచారణలో వెల్లడించారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఇంతకాలం ఎమ్మెల్సీ కవిత లక్ష్యంగానే ఈడీ దర్యాప్తు కొనసాగించిన విషయం తెలిసిందే. ఆమెకు మాత్రమే నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పిన ఈడీ అధికారులు ఆమె అరెస్ట్ అయ్యే వరకు కూడా కవిత కుటుంబ సభ్యుల జోలికి వెళ్లలేదు. కవిత అరెస్ట్ తరువాత ఆమె భర్త అనిల్ తో పాటు పీఏలు ఇతర వ్యక్తులకు మాత్రం నోటీసులు ఇచ్చింది. కానీ అనూహ్యంగా శనివారం కవిత ఆడపడుచు ఇంట్లో తనిఖీలు చేపట్టడం వెనక కారణం ఏమై ఉంటుందోనన్నదే అంతుచిక్కడం లేదు. ఈడీ అధికారులు అత్యంత కీలకమైన సమాచారం అందుకునే ఈ సోదాలు చేస్తున్నారా లేక అనుమానంతో దాడులకు పూనుకున్నారోనన్న విషయంపై ఈడీ ప్రకటన వెలువరిస్తే తప్ప స్ఫస్టత వచ్చే అవకాశం లేదు.

కస్టడీ ఎక్స్ టెన్షన్..?

అయితే కవిత కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఆమెను మరిన్ని రోజుల పాటు విచారించేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే లిక్కర్ స్కాంకు సంబంధించిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాగా ఆయనను కూడా కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కలిసి విచారించేందుకు అనుమతించాలని ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. మనీ ల్యాండరింగ్ ద్వారా కవిత కేజ్రీవాల్ పార్టీకి డబ్బులు పంపించినట్టుగా తమ విచారణలో తేలిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీలకు సంబంధించిన విషయంపై క్లారిటీ వచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్, కవితలను విచారించేందుకు అనుమతి కోరనున్నట్టుగా భావిస్తున్నారు.

సీబీఐకి…

మరో వైపున కవితను సీబీఐ కూడా విచారించేందుకు కోర్టు అనుమతి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే విచారించిన సీబీఐ అధికారులు ఆమె అరెస్ట్ అయిన నేపథ్యంలో కస్టడీలో విచారించడంతో పాటు తమ వద్ద ఉన్న ఆధారాలను బేస్ చేసుకుని ఇంటరాగేషన్ చేస్తామని సీబీఐ కూడా కస్టడీ కోరనున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page