దిశ దశ, హైదరాబాద్:
హైదరాబాద్ కొత్వాల్ బాధ్యతలు రెండు సార్లు చేపట్టిన ఏకైక ఐపీఎస్ అధికారిగా సివి ఆనంద్ నిలిచారు. హైదరాబాద్ కమిషనరేట్ ఆవిర్భాం అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక పోలీసు అధికారి రెండు సార్లు కమిషనర్ బాధ్యతలు తీసుకున్న దాఖలాలు లేవు. అడిషనల్ డీజీపీ క్యాడర్ లో ఉన్న అధికారికే హైదరాబాద్ కమిషనరేట్ బాధ్యతలు అప్పగించే ఆనవాయితీ కొనసాగేది. అయితే డీజీపీ స్థాయిలో ఉన్న అధికారికి తొలిసారిగా బాధ్యతలు అప్పగించడం మరో విశేషం.
కొత్వాల్ క్రెడిట్…
1847లో హైదరాబాద్ స్టేట్ లో సిటీకి కమిషనర్ల నియామక ప్రక్రియ ప్రారంభం అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 61 మంది కమిషనర్లు హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజాం కాలంలో అయినా, స్వాంత్రంత్ర్యం అనంతరం అయినా కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీ కమిషనర్లుగా ఒకే అధికారి రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించలేదు. తాజాగా బాధ్యతలు తీసుకున్న డీజీపీ సివి ఆనంద్ ఒక్కరు మాత్రమే రెండు సార్లు బాధ్యతలు చేపట్టారు. ఆయన మొదట 2021 డిసెంబర్ 25 నుండి 2023 అక్టోబర్ 11 వరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ గా పని చేశారు. ఆ తరువాత ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు సందీప్ శాండిల్య బాధ్యతలు నిర్వర్తించగా, 2023 డిసెంబర్ 13 నుండి 2024 సెప్టెంబర్ 7 వరకు సీపీగా వ్యవహరించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సివి ఆనంద్ ను హైదరాబాద్ సిటీ కమిషనర్ గా నియమించడం గమనార్హం. ఇప్పటికే డీజీ హోదాలో ఉన్న ఆయనను తిరిగి సిటీ కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా అడిషనల్ డీజీ స్థాయి అధికారికి హైదరాబాద్ కమిషనరేట్ సీపీగా నియమిస్తుంటారు. ఆ తరువాత డీజీపీగా పదోన్నతి పొందుతారు కాబట్టి అడిషనల్ డీజీ స్థాయి అధికారిని ఆ స్థానంలో నియమించడం ఆనవాయితీ. అయితే ఈ సారి డీజీ స్థాయికి చేరుకున్న అధికారికి సిటీ కమిషనరేట్ బాధ్యతలు అప్పగించడంతో రెండో సారి అవకాశం దక్కి ఉంటుందని అంచనా వేస్తున్నారు.