రంగంలోకి దిగిన ముంబాయి పోలీసులు
దిశ దశ, కరీంనగర్:
ఇంతకాలం సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకున్న బాధితులు మాత్రమే కరీంనగర్ లో ఉన్నారనుకున్నప్పటికీ… ఇఫ్పుడు సైబర్ క్రిమినల్స్ అడ్డాగా కూడా జిల్లా కేంద్రం మారినట్టుగా తెలుస్తోంది. ముంబాయి నగరానికి చెందిన సైబర్ సెక్యూరిటీ వింగ్ పోలీసులు కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరీంనగరానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ముంబాయి సైబర్ సెక్యూరిటీ వింగ్ బృందం వారిని ఇక్కడి నుండి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గురువారం మద్యాహ్నం కరీంనగర్ కు వచ్చిన ఈ టీమ్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ముంబాయి సైబర్ సెక్యూరిటి వింగ్ పోలీసులు వారి నుండి వివరాలు రాబడ్తున్నట్టు సమాచారం. సాంకేతికత ఆధారంగా ఆరా తీస్తున్న క్రమంలో కరీంనగర్ కు చెందిన ముగ్గురు అనుమానితుల భాగస్వామ్యం కూడా ఓ కేసులో ఉన్నట్టుగా తేలడంతో వారిని పట్టుకునేందుకు ఇక్కడకు వచ్చినట్టు సమాచారం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో అంతర్జాతీయ సైబర్ క్రైం గ్యాంగ్ చేతులు కలిపి భారీ ఎత్తున నగదు బదలాయించుకున్నట్టుగా సమాచారం. భారతీయులను ఈ ఉచ్చులోకి దింపిన అంతర్జాతీయ ముఠాతో లింకులు ఉన్న వారి గురించి ముంబాయి సైబర్ సెక్యూరిటీ వింగ్ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం ఇందులో భాగంగా కరీంనగర్ కు వచ్చిన వీరు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ త్రి టౌన్ పోలీస్ స్టేషన్ కు వీరిని తీసుకెళ్లిన ముంబాయి స్పెషల్ టీమ్ వారిని విచారిస్తున్నట్టుగా సమాచారం. అయితే వీరిని ముంబాయికి తరలించే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.