కస్టమ్స్ అధికారి పేరిట దోపిడీ… సైబర్ నేరస్తుడి అరెస్ట్…

దిశ దశ, కరీంనగర్:

రీంనగర్ జిల్లాకు చెందిన ఓ బాధితురాలికి కాల్ చేసి కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రతినిధిగా మాట్లాడి రూ. 21 లక్షలు తన అకౌంట్లోకి బదిలీ చేసుకున్న నిందితుడిని కరీంనగర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టుకు  పార్సిల్ వచ్చిందని, అందులో బ్యాంక్ ఎటిఎం కార్డ్సులు, డ్రగ్స్, పాస్ పోర్టు ఉన్నాయని వెంటనే ఢిల్లీ పోలీసులతో మాట్లాడాలని అగంతకుడు ఫోన్ చేశాడు. కాన్ఫరెన్స్ కాల్ లో ఢిల్లీ పోలీసు అధికారులుని మాట్లాడించి బాధితురాలిని మోసం చేశాడు. ఆమె తనతో మాట్లాడుతున్నది కస్టమ్స్ ఆఫీసర్ అని నమ్మి అగంతకుడు ఇచ్చిన బ్యాంక్ అకౌంటుకు రెండు దఫాలుగా రూ. 21.80 లక్షలు పంపించారు. ఆ తరువాత అనుమానం రావడంతో బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సెంటర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న డీఎస్పీ నర్సింహారెడ్డి బాధితురాలి నుండి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ జారీ చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు డబ్బులను బదిలీ చేయించుకున్నాడన్న విషయాన్ని గుర్తించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ నేతృత్వంలోని బృందం ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ జిల్లాలో తలదాచుకున్న సదాన్షు శేఖర్ మహంతిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కరీంనగర్ కోర్టులో హాజరు పర్చారు.

వ్యాపారం పేరిట…

భువనేశ్వర్ లో వ్యాపారం చేస్తున్నామని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు నమ్మించి సదాన్షు శేఖర్ మహంతి ORPLE APPLIANCES PVT LTD పేరు పై బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తన అన్న అయినటువంటి సర్వేశ్వర్ మహంతి సహాకారంతో బ్యాంక్ అకౌంట్ ఖాతా తీసుకున్నట్టుగా సైబర్ పోలీసుల విచారణలో తేలింది. బాధితులకు ఫోన్లు చేస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తూ వసూళ్లకు పాల్పడుతుండేవాడు. సర్వేశ్వర మహంతి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారని, అతనిపై అక్కడ కూడా కేసులు నమోదయ్యాయని కరీంనగర్ సైబర్ వింగ్ పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సదాన్షు శేఖర్ మహంతి వివిధ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. ఈ బ్యాంకు అకౌంట్ పై 24 కేసులు నమోదు కాగా తెలంగాణలోని మూడు జిల్లాల్లో, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ,తమిళనాడు, బీహార్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తేల్చారు. నిందితుడిని పట్టుకోవడంలో సఫలం అయిన కరీంనగర్ సైబర్ పోలీసు బృందాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ అభినందించారు.

అప్రమత్తంగా ఉండండి…

సైబర్ క్రిమినల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్ సెక్యూరిటీ SHO నర్సింహరెడ్డి సూచించారు. కస్టమ్స్ , ట్రాయ్ పేరుతో వస్తున్న ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అగంతకుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని, అప్లికేషన్ ఫైల్స్ ను డౌన్ లోడ్  చేయొద్దని వాటిపైన క్లిక్ చేయవద్దని కోరారు.

You cannot copy content of this page