దిశ దశ, కరీంనగర్:
టెక్నాలజీని అందిపుచ్చుకుని సైబర్ క్రిమినల్స్ పాల్పడుతున్న నేరాల తీరు అత్యంత విచిత్రంగా ఉంది. నిజంగా పోలీసులే ఫోన్ చేశారా అన్న రీతిలో నేరగాళ్లు బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసిన తీరు బాధితులను ఆందోళనకు గురి చేసే విధంగా ఉంది. కరీంనగర్ సాయి నగర్ కు చెందిన సింగర్ కం ఈవెంట్ ఆర్గనైజర్ చిలువేరు శ్రీకాంత్ కు ఆదివారం కాల్ చేసిన అగంతకులు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు శ్రీకాంత్ ను ముప్పు తిప్పలు పెట్టిన అగంతకులు వ్యవహరించిన తీరుతో ఆయన అనుమానించి వారి బారిన పడకుండా జాగ్రత్త పడ్డారు.
అయినా వదలకుండా…
ఆదివారం మద్యాహ్నం వీడియో కాల్ చేసినప్పుడు సైబర్ క్రిమినల్స్ అన్న విషయాన్ని పసిగట్టిన శ్రీకాంత వారితో మళ్లీ టచ్ లోకి వస్తానని చెప్పి తప్పించుకున్నాడు. అయినప్పటికీ క్రిమినల్స్ మళ్లీ వీడియో కాల్ చేయడంతో శ్రీకాంత్ రెస్పాండ్ కాలేదు. ఆ తరువాత నీ గురించి లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చి క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ మెసెజ్ చేశారు.
సెటప్ ఇలా…
సూట్స్ వేసుకున్న సెక్యూరిటీ అధికారులు వెనక వైపున ఉండగా ముందు నిలబడి ఉన్న సీనియర్ అధికారి మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేసిన అగంతకులు ఛీటింగ్ కు పాల్పడేందుకు సరికొత్త మార్గాలు ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. మరో చోట మఫ్టీలో సీనియర్ అదికారి ఉన్నట్టుగా ఆయన వెనక ఖాకీ దుస్తులు వేసుకున్న పోలీసు అధికారి నిలబడినట్టుగా సీన్ క్రియేట్ చేసి వీడియో కాల్ మాట్లాడారు. అయితే స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న వారిని కూడా సైబర్ క్రిమినల్స్ క్రియేట్ చేసి ఉంటారని యాప్స్ సాయంతో ఇలా డిజైన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. శ్రీకాంత్ కు వీడియో కాల్ చేసిన వారు ముంబాయి పోలీస్ లోగోను కూడా వాడుకోవడం గమనార్హం.
సీబీఐ అధికారులనూ…
మొదట ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ED) అధికారులుగా కామన్ కాల్ చేసిన అగంతకులు ఆ తరువాత వీడియో కాల్ చేసి చాలా సేపు శ్రీకాంత్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా CBI అధికారులను కూడా లైన్ లోకి తీసుకుంటున్నామని చెప్పి ఇతరులతో మాట్లాడించారు. వీరు ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడుతూ శ్రీకాంత్ ను డైలమాలో పడేశారు. నిజంగానే శ్రీకాంత్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డానా అన్న రీతిలో వారి ఇంటరాగేషన్ విధానం నడిచింది. దీంతో కొంతసేపు తటపటాయించిన శ్రీకాంత్ తాను భారీ స్కాంలో ఇరుక్కపోయాననన్న ఆందోళనకు గురయ్యాడు.
అక్కడే మిస్టేక్…
అయితే ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి 12 గంటల వరకూ శ్రీకాంత్ ను ముప్పు తిప్పలు పెట్టిన అగంతకులు ఆయనతో మాట్లాడిన తీరే వారి నేరపూరితమైన కుట్రను బట్టబయలు చేసింది. టెన్షన్ కు గురవుతున్నావని నీకేం కాదని తామే సుప్రీం కోర్టు న్యాయవాదులతో మాట్లాడుతామని ఇందుకు ఫీజు రూ. 3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అనడంతో శ్రీకాంత్ కు సీన్ మొత్తం అర్థం అయిపోయింది. ఆర్థిక నేరానికి పాల్పడినట్టయితే తాను అడ్వకేట్ ద్వారా కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది కానీ, ఈడీ, సీబీఐ అధికారుల పేరిట తనకు కాల్ చేసిన వారే అడ్వకేట్ ద్వారా కోర్టును ఆశ్రయించేందుకు సాయం చేస్తామనడం ఏంటీ..? దీని వెనక ఏదో గూడ్ పుఠాణి ఉందని అనుమానించాల్సిన పరిస్థితి శ్రీకాంత్ కు ఎదురైంది. తాను సైబర్ క్రిమినల్స్ ట్రాప్ లో చిక్కుకున్నానని, తనకు జాతీయ దర్యాప్తు సంస్థల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న అనుమానం వచ్చిందని శ్రీకాంత్ వివరించారు.
దర్యాప్తు సంస్థల తీరు ఇలా…
వాస్తవంగా జాతీయ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు కూడా ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకు ఈడీ అధికారులు ఫోన్ చేసి ఇంటరాగేషన్ చేసేందుకు చొరవ తీసుకునే అవకాశం ఉండదు. ఆర్థిక నేరాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత CRPC 41 లేదా సెక్షన్ 35(5) BNS యాక్టు ప్రకారం ఈడీ అధికారులు ఆర్థిక నేరాల అభియోగం కింద విచారణకు రావాలని నేరుగా నోటీసులు పంపిస్తారు. ఈ నోటీసుల్లోనే విచారణకు ఏ రోజున హాజరు కావల్సి ఉంటుంది, ఎక్కడ అటెండ్ కావల్సి ఉంటుంది అన్న వివరాలను స్పష్టంగా పేర్కొంటారు. కానీ సీబీఐ అదికారులు, ఈడీ అధికారులు కలిసి దర్యాప్తు చేసే అవకాశాలు మాత్రం ఉండవు. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో క్రిమినల్ సంబంధిత అంశాలు ఉన్నట్టయితే ఆ ఫైలు ఆదారంగా సీబీఐ మరో కేసు నమోదు చేసుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణకు రావాలని మరో నోటీసు జారీ చేస్తుంది కానీ రెండు సంస్థలు ఏకకాలంలో విచారించేందుకు, వీడియో కాల్స్ లేదా రెగ్యూలర్ కాల్స్ ద్వారా మాత్రం విచారించే అవకాశాలు ఉండవు. ఇలాంటి ఫేక్ కాల్స్ విషయంలో దర్యాప్తు సంస్థలు ఎలా వ్యవహరిస్తాయి అన్న విషయాలపై కూడా సమగ్రంగా అవగాహన పెంచుకోవల్సిన అవసరం ఉంది. లేనట్టయితే సైబర్ నేరగాళ్ళు కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజే ప్రమాదం ఉంటుంది. జాతీయ దర్యాప్తు సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసుల సహాకారం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ విషయంలో మాత్రం సపరేట్ గా ఉంటుంది.