దిశ దశ, వరంగల్:
వరంగల్ జిల్లాలో సైబర్ క్రిమినల్స్ కలకలం లేచింది. ఏకంగా డిప్యూటీ తహసీల్దార్ కు కాల్ చేసిన నేరగాళ్లు రూ. 80 వేలు వసూలు చేశారు. అవినీతి నిరోధకశాఖ అధికారుల పేరు చెప్పగానే సదరు అధికారి డబ్బులు అకౌంట్ నుండి బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలోనే సైబర్ క్రిమినల్స్ ఏసీబీ అధికారుల పేరిట వసూళ్లకు పాల్పుడుతున్న విషయాన్ని గమనించిన అధికారులు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీబీ అధికారులు ఎవరికీ ఫోన్ చేయరని సైబర్ నేరగాళ్లు ఇలా వ్యవహరిస్తుంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అయినప్పటికీ తాజాగా సంగెం డిప్యూటీ తహసీల్దార్ సైబర్ క్రిమినల్స్ కు రూ. 80 వేలు చెల్లించినట్టుగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
ఎందుకిచ్చారు..?
సైబర్ క్రిమినల్స్ ఏసీబీ పేరు చెప్పగానే సదరు అదికారి రూ. 80 వేల డబ్బులు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ కూడా సాగుతోంది. ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతూ బెదిరించారా లేక ఏసీబీ అధికారులకు మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారా అన్న విషయంపై క్లారిటీ రావల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఏసీబీ పేరు చెప్పినప్పటికీ చకాచకా డబ్బులు వారి అకౌంట్ల బదిలీ చేశారంటో దీని వెనక ఏదో మతలబు ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏసీబీ తన జోలికి ఎందుకు వస్తుందని అనుమానించకుండా డిప్యూటీ తహసీల్దార్ ఠక్కున అమౌంట్ పంపించిన తీరుపై కూడా చర్చ జరుగుతోంది. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారే సైబర్ క్రిమినల్స్ ట్రాప్ లో పడితే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.