ప్రకాష్ అంబేడ్కర్ కితాబు
దిశ దశ, హుజురాబాద్:
రాష్ట్రంలో అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాష్ అంబేడ్కర్ కితాబిచ్చారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి పురస్కరించుకుని తెలంగాణాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన హుజురాబాద్ లో దళిత బంధు కార్యక్రమం అమలు తీరు తెన్నులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దళిత బంధు పథకం సరికొత్త ప్రయోగమని, నిన్న మొన్నటి వరకు వేరే వాళ్ల వద్ద నౌకర్లుగా పనిచేసిన వీరంతా నేడు యజమానులుగా మారిపోవడం ఆదర్శప్రాయంగా ఉందన్నారు. ఈ స్కీం అమలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ప్రకాష్ అంబేడ్కర్ ఇలాంటి పథకాలు పకడ్భందీగా అమలు చేస్తే మరింతమందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. చదువతో పాటు ఉపాధి కల్పించే పథకాలు అమలు చేస్తేనే దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్తాయన్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్దంగా ఉన్నా ష్యురిటీ అడుగుతుండడం దళితుల ఆర్థిక అభ్యున్నతికి ఇబ్బందులు తెచ్చిపెడ్తోందన్నారు. 70ఏళ్లుగా దేశంలో దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవడంతో ఇబ్బందులు పడుతున్న తీరును చూశానని ఇలాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దారిద్రరేఖకు దిగువను ఉన్న 30 శాతం బలహీన వర్గాలకు చెందిన వారిని కూడా దళిత బంధు స్కీంలో చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభ్యర్థిస్తానని ప్రకాష్ అంబేడ్కర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.