సిరొంచ తాలుకాలో ఘటన
దిశ దశ, దండకారణ్యం:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తులను నిలువరిస్తున్నారు అక్కడి వారు. ఆ పార్టీ ఉనికికే సవాల్ విసురుతూ తమ ప్రాంతంలో గులాభి జెండాకు స్థానం ఉండకూడదన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించగా, స్థానికంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వారిని కూడా వ్యతిరేకులగా తయారు చేశారు. తాజాగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కూడా చింపివేస్తుండడం గమనార్హం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలో బీఆర్ఎస్ అంటేనే మండిపడుతున్నారు. సిరొంచకు దిగువన నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ వల్ల తమ భూములు ముంపునకు గురవుతున్నాయని కొంతకాలంగా 12 గ్రామాల రైతులు నిరసనలు చేపడ్తున్న సంగతి తెలిసిందే. మొదట నోటిఫై చేసిన భూములకు వంద శాతం పరిహారం అందకపోగా, అదనంగా ముంపునకు గురవుతున్న భూములపై సర్వే చేసి తమకు పరిహారం ఇవ్వాలని బాధిత గ్రామాల రైతులు నెలల తరబడి ఆందోళన చేశారు. చివరకు నాగపూర్ లో అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న క్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిసిన బాధిత రైతులకు తమకు న్యాయం చేయాలని తొలి విడుత ప్రకటించిన భూములకు కూడా పరిహారం అందలేదని, అదనంగా భూములు ముంపునకు గురవుతున్నందున మహా సర్కార్ ఒప్పందం చేసినందున తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమను ఆదుకోవాలని కోరారు. ఇందుకు సమ్మతించిన ఫడ్నవిస్ ఈ మేరకు చర్యలు తీసుకుంటామని బాధిత రైతులకు న్యాయం చేస్తామన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పరిహారం తాలుకు డబ్బులు మహారాష్ట్ర సర్కార్ కు బదిలీ చేయలేదు. దీంతో తమకు రావల్సిన పరిహారం తాలుకు డబ్బులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు బాధిత రైతులు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం లక్ష్యంగా నిరసనలు తెల్పడం, సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం ఆరంభించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సమయంలో కేసీఆర్ ను ఇష్టారీతిన కామెంట్ చేసిన దీపక్ దాదా ఆత్రం ఇప్పుడు కేసీఆర్ ను భుజానికెత్తుకోవడంపై సిరొంచ తాలుకా రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో కేసీఆర్ ను విమర్శించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ చేస్తున్నారు. తాజాగా సిరొంచ కేంద్రంలో దీపక్ దాదా ఆత్రం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చింపేశారు. ఇది మేడిగడ్డ బాధిత రైతాంగం పనేనన్న ప్రచారం జరుగుతోంది. శనివారం రోజునే మహారాష్ట్రలోని రైతు సంఘం నేతలను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు కేసీఆర్. హైదరాబాద్ లో వారిని బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి తెలంగాన సస్యశామలం కోసం ఎలా పాటుపడ్తున్నామో చూడాలని సూచించారు. ఇదే రోజున కాళేశ్వరం బాధిత రైతులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపేయడం గమనార్హం.