పగుళ్లు బారిన కేబుల్ బ్రిడ్జి…

కనిపించకుండా కవర్లు కప్పి…

కాంగ్రెస్ పార్టీ నిరసన

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ నగరానికే తలమానికం కావల్సిన ఆ వంతెన కాస్తా పగుళ్లు బారి పోతోంది. ప్రారంభించిన తొలినాళ్లలోనే నెర్రలు రావడం విస్మయం కల్గిస్తోంది. మొదటి సారి వచ్చిన వర్షాలకే వంతెన అప్రోచ్ రోడ్ కూడా కుంగిపోవడం గమనార్హం. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం దిగువన పాత వరంగల్ రహదారిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిని ఇటీవల ప్రారంభించారు. టూరిస్ట్ కేంద్రంగా కూడా మారిన ఈ వంతెనకు అప్పుడే పగుళ్లు రావడంపై ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. వంతెనకు అప్రోచ్ రోడ్డులో కొంత భాగం కుంగిపోగా, వంతెనపై నిర్మించిన సైడ్ వాల్స్ కు పగుళ్లు వచ్చాయి. అలాగే ఆర్సీసీపై వేసిన బీటీ రోడ్డు కూడా బీటలు వారిపోవడంపై కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రూ. 180 కోట్ల వరకు వెచ్చించి నిర్మించిన తీగల వంతెన నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. బ్రిడ్జికి ఇరువైపులా నిర్మించిన వాల్స్ పగుళ్లు రావడంతో ఎవరికీ కనిపించకుండా కవర్లు వేశారని కూడా ఆరోపించారు. ఈ వంతెన నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. కాంట్రాక్టర్ నాణ్యత పాటించకపోవడం వల్లే నెల రోజులు కాకముందే కేబుల్ బ్రిడ్జికి పగుళ్లు వచ్చాయని ఆరోపించారు. కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన లోపాలు ఎత్తి చూపుతున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

You cannot copy content of this page