కమలాపూర్ విద్యార్థి రిజల్ట్ ప్రకటించని బోర్డు
దిశ దశ, వరంగల్:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎస్సెస్సీ బోర్డు ఇంకా ఆ విద్యార్థిని మాల్ ప్రాక్టీస్ స్టూడెంట్ గానే భావిస్తోంది. హై కోర్టు ఆదేశాలతో పరీక్షలకు అనుమతించినప్పటికీ ఫలితాల్లో మాత్రం అతని వివరాలను పొందుపర్చకుండా మాల్ ప్రాక్టీస్ కేసుగానే చూపిస్తుండడం విస్మయం కల్గిస్తోంది.
ఏం జరిగిందంటే…?
హన్మకొండ జిల్లా కమలాపూర్ లో హిందీ పేపర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా కుట్రతో పాటు మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పేపర్ బయటకు ఇచ్చాడన్న కారణంగా కమలాపూర్ స్టూడెంట్ దండబోయిన హరీష్ ను మాల్ ప్రాక్టీస్ కింద చూపించి పరీక్షలకు హాజరు కాకూడదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో హరీష్ జీవితం నాశనం అవుతోందని బయట నుండి వచ్చిన వ్యక్తి హరీష్ ను బెదిరించి పరీక్ష పత్రాన్ని తీసుకున్నాడని అయితే ఇందుకు బాద్యున్ని ఆ స్టూడెంట్ ను చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హై కోర్టును ఆశ్రయించడంతో దండబోయిన హరీష్ ను పరీక్షలకు అనుమతించాలని హై కోర్టు ఆదేశించింది. హాజరు కానీ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహించాలని కూడా హై కోర్టు విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారులు హరీష్ ను పరీక్షలకు అనుమతించడంతో అతన్ని సమస్య నుండి గట్టెక్కించారని సంతోషించారంతా. అయితే ఫలితాలను చూసిన తరువాత దండబోయిన హరీష్ పరిస్థితి ఎలా అన్న ఆందోళన మొదలైంది.
మాల్ ప్రాక్టీస్ స్టూడెంటే..!
కమలాపూర్ స్టూడెంట్ దండబోయిన హరీష్ పరీక్షా ఫలితాలకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన కాలమ్ అంతా ఖాళీగా ఉంచడంతో పాటు, గ్రేడ్ పాయింట్స్ వద్ద రిజల్ట్ మాల్ ప్రాక్టీస్ అని రాసి ఉంది. దీంతో హైకోర్టు ఆదేశించినప్పటికీ విద్యాశాఖ అధికారులు మాత్రం అతన్ని మాల్ ప్రాక్టీస్ స్డూడెంట్ గానే పరిగణనలోకి తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది. కోర్టు ఆదేశాలతో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇఛ్చినప్పటికీ ఫలితాలు ప్రకటించే విషయంలో మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందా లేక విద్యాశాఖ అధికారులు హై కోర్టు ఆదేశాలను బోర్డుకు పంపించ లేదా అన్నది అంతుచిక్కకుండా పోతోంది. తనను పరీక్షలకు అనుమతించడంతో సంబరపడిపోయిన దండబోయిన హరీష్ కూడా ఫలితాలను ఆన్ లైన్ లో చూసుకుని ఖంగుతిన్నాడు. మాల్ ప్రాక్టీస్ గా తన షీట్ లో పేర్కొనడంతో హరీష్ ఇప్పుడు తానేం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.