దిశ దశ, దండకారణ్యం:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ చోట షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడితో పాటు ఆయన భార్యను ఏటీఎస్ బలగాలు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్కాడ్ (ఏటీఎస్) బలగాలు కుస్నం అశోక్ రెడ్డి అలియాస్ ఉఫయ్ అలియాస్ లద్వే (62), ఆయన భార్య రామ్తి అలియాస్ ఉఫయ్ కుమారి ఉరఫ్ పోతాయిని(43) అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న అశోక్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాగా ఆయన భార్య పోతాయ్ ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్ పూర్ జిల్లా నివాసి అని, నార్త్ రీజియన్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నారని అక్కడి పోలీసులు వివరించారు. మధ్య ప్రదేష్ లోని జబల్ పూర్ లో అరెస్టయిన వీరిని అక్కడి కోర్టులో హాజరు పరిచారు. అశోక్ రెడ్డిపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో తీవ్రమైన నేరాలకు సంబంధించిన 60కి పైగా కేసులు ఉండగా రూ. 82 లక్షల రివార్డు ఉండగా ఆయన భార్య పొతాయ్ పై రూ. 20 లక్షల రివార్డు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అశోక్ రెడ్డి, ఆయన భార్య రామ్తిల వద్ద రూ. 3 లక్షల నగదు, ఓ ఆయుధం, మావోయిస్టు పార్టీ సాహిత్యాన్ని ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ రెడ్డి ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతల్లో ఉన్నారని అయితే అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ క్యాడర్, నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే పనిలో కూడా నిమగ్నం అయినట్టుగా ఏటీఎస్ పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం.
సూర్యపేట జిల్లా వాసి…
అశోక్ రెడ్డి సూర్యపేట జిల్లా తిరుమలగిరికి చెందిన వ్యక్తిగా పోలీసుల విచారణలో తేలింది. 1982లో ఉప్పల్ లోని ఓ ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ కంపెనీలో పని చేస్తూ ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియాలో ఏంఎ సోషియాలజి పూర్తి చేశారు. 1983లో ఏఐటీయూసీ కార్యదర్శిగా పని చేస్తూ కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న అశోక్ రెడ్డి 1989లో పీపుల్స్ వార్ లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1989లో బక్కారెడ్డి అనే వ్యక్తి హత్యతో పాటు నాలుగు బస్సులను తగులబెట్టిన అశోక్ రెడ్డి మూడేళ్ల పాటు జైలులో జీవితం గడిపారు. అనంతరం 1992లో అంప్రో బిస్కట్ కంపెనీ మేనేజర్ గోవిందరాజులు హత్య కేసులో అరెస్ట్ అయిన అశోక్ రెడ్డి 1995లో బెయిలుపై విడుదల అయిన ఆయన దండకారణ్య అటవీ ప్రాంతానికి వెళ్లి గోందియా ప్రాంతంలోని దరకస, తందా దళాల్లో 1997 ప్రాంతంలో పని చేశారు. 2001లో గడ్చిరోలి ఏరియా కమిటీ దళ మెంబర్ రజితను పెళ్లి చేసుకున్న అశోక్ రెడ్డి 2006లో మహారాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 2007లో నాగపూర్ లో అరెస్ట్ అయిన ఆయన 2012 వరకు అక్కడి జైలులోనే ఉన్నారు. తరువాత కొంతకాలం ఆయన స్వగ్రామంలోనే ఉన్న అశోక్ రెడ్డి మళ్లీ 2014లో అడవి బాట పట్టారు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అశోక్ రెడ్డిని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ఏటీఎస్ బలగాలు అరెస్ట్ చేశారు.
తెలంగాణ ఎస్ఐబీ కీలక పాత్ర..?
అయితే మధ్యప్రదేశ్ లో పట్టుబడిన డికెఎస్ జడ్ సి సభ్యుడు అశోక్ రెడ్డి దంపతుల అరెస్ట్ వెనక తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారుల పాత్ర కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల పార్టీలో పని చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిపై ప్రత్యేక నిఘా వేసిన ఎస్ ఐ బి అశోక్ రెడ్డిని గుర్తించి అక్కడి ఏటీఎస్ బలగాలను రంగంలోకి దింపినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post