కీకారణ్యంలోకి భద్రతా బలగాలు… మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్…

దిశ దశ, దండకారణ్యం:

త్రుదుర్భేద్యంగా ఉంటాయనుకున్న అడవుల్లో అసువులు బాస్తున్నారు అన్నలు… దేశంలోనే దట్టమైన అటవీ ప్రాంతాలుగా పేరొందిన దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. క్రాంతికారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న నక్సల్స్ కు పెట్టనికోటగా ఉన్న అభూజామఢ్ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి కూంబింగ్ పార్టీలు. మంగళవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు రణదేవ్ దాదాతో పాటు మరో ఎనిమిది మంది మృత్యువాత పడడం పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చుంది.

ఎన్ కౌంటర్ ఇలా…

దంతేవాడ మరియు బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని లోహగావ్, పురంగెల్ ఆండ్రి అడవుల్లో విస్తరించిన కొండల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మరణించారు. PLGA-2 కంపెనీ దండకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నదన్న సమాచారం అందుకున్న పోలీసు అధికారులు దంతెవాడకు చెందిన ఎలైట్ ఫోర్స్, DRG, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ 111 బెటాలియన్లు, 230 కార్ప్స్ యంగ్ ప్లాటూన్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక SLR, 303 రైఫిల్స్ 2, కార్బైన్ 9ఎంఎం 1, 8 ఎంఎం రైఫల్ 1, 315 బోర్ రైఫిల్ 1, 12 బోర్ రైఫిల్స్ 2, బిజి నంబర్ 2, లోడెడ్ గన్స్ 2ను స్వాధీనం చేసుకున్నారు.

నిఘా వర్గాల అలెర్ట్…

దంతెవాడ, బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని నిఘావర్గాలు సమాచారం ఇవ్వడంతో బలగాలు సెర్పింగ్ ఆపరేషన్ చేపట్టాయి. పశ్చిమ బస్తర్ డివిజన్, దర్భా డివిజన్ కు చెందిన PLGA కంపెనీ 2కి చెందిన నక్సల్స్ అక్కడ తారస పడడంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టిన బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ బాధ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు రణధీర్ అలియాస్ రణదేవ్ దాదా అలియాస్ ఏసోబు, ప్లాటూన్ మెంబర్ శాంతి, ACM సుశీల మడ్కం, భర్త జగదీష్, కాటేకల్యాణ్ ఏరియా కమిటీ మెంబర్ గంగి ముచకి, మలంగిర్ ఏరియా కమిటీ మెంబర్ కోసా మాద్వి, DVCM సురక్షా దళ్ మెంబర్లు హిడ్మే మంకం, లలిత, ప్లాటూన్ మెంబర్ కమలేష్, AOBSZC గార్డ్ కవితలు చనిపోయారు.

వరస ఘటనలు…

దండకారణ్యంలో ఇంతకాలం బలగాలు స్వీయ రక్షణ చర్యలు తీసుకునే పరిస్థితులు కొనసాగాయి. కానీ ఇప్పుడు మావోయిస్టులు బలగాల కదలికలను అంచనా వేయలేకపోతున్నాయి. కీకారణ్యంనై అణువు అణువు పట్టున్న మావోయిస్టు పార్టీ కదలికలు ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు సమాచారం అందుతుండడం గమనార్హం. అంతేకాకుండా అక్కడి అటవీ ప్రాంతంపై బలగాలు పట్టు సాధించుకుని ఏరివేతలో పాల్గొంటున్నాయి. దీంతో మావోయిస్టులపై బలగాలు పైచేయి సాధిస్తుండడంతో పార్టీ క్యాడర్ ను కోల్పోతున్న పరిస్థితి తయారైంది. లొంగుబాట్లు, అరెస్టులు, ఎన్ కౌంటర్లతో మావోయిస్టు ఉనికికే సవాల్ విసురుతున్నాయి బలగాలు. బస్తర్ డివిజన్‌లో నక్సల్స్‌ ఏరివేతలో భాగంగా ఒక్క ఈ ఏడాదిలోనే 153 మంది నక్సల్స్ మరణించగా, 669 మంది అరెస్టు, 656 మంది లొంగిపోయారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి మీడియాకు వివరించారు.

ఏసోబు ప్రస్తానం ఇదే…

కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగిన ఏసోబు స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం టేకులగూడెం. పదో తరగతి వరకు చదువున్న ఏసోబో మొదట ఓ పెత్తాందారు వద్ద పనిచేశాడు. భస్వామ్య వ్యతిరేక నినాదం, పెత్తందారి వ్యవస్థపై పోరాటానికి పిలుపునిచ్చిన విప్లవ పార్టీ వైపు అడుగులు వేశాడు. మొదట రాడికల్ యువజన సంఘం (RYL)లో చేరిన ఆయన 1990, 1991 ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు. మొదట అన్నాసాగర్ దళంలో పనిచేసిన ఏసోబు 1995లో వరంగల్ జిల్లా కమిటీ సభ్యునిగా, రాష్ట్ర కమిటీలో బాధ్యతల్లో పనిచేసి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగారు. ప్రస్తుతం మహారాష్ట్, చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంత ఇంచార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. జనతన్ సర్కార్ లో వ్యవసాయ కమిటీ బాధ్యునిగా పనిచేసిన ఆయన మంగళవారం నాటి ఎన్ కౌంటర్ లో చనిపోయారు. 1998 ప్రాంతంలో స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని మీదికొండ, కౌకొండ గుట్టల్లో జరిగిన ఎన్ కౌంటర్ తో పాటు పలు ఘటనల నుండి తప్పించుకున్నాడు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన రణదేవ్ దాదా అభుజామఢ్ అటవీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. పీపుల్స్ వార్ నిర్మాణం చేసిన కొండపల్లి సీతారామయ్య, ముప్పాళ లక్ష్మణ్ రావు, మలోజ్జుల వేణుగోపాల్, కిషన్ జీ తదితర తొలితరానికి చెందిన నేతల్లో ఒకరిగా ఏసోబు ఉన్నారని చెప్తున్నారు.

You cannot copy content of this page